వానాకాలం పంట సీజన్ కోసం రైతుబంధు సాయాన్ని 15 నుంచి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని.. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో మొదలు పెట్టి రైతులందరికీ 10 రోజుల్లో సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు సాయం కింద రూ.7 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
కరోనా ఉద్ధృతి, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది. మార్చి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రావడంతో ఏప్రిల్ నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 6,500 కోట్లు దాటింది. ఏప్రిల్ నెలలో ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ రంగాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఏప్రిల్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఓ మోస్తరు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు కొన్నాళ్ల పాటు నిలిచిపోవడంతో ఆ ఆదాయం వచ్చే అవకాశం లేదు. దీంతో పాటు ఇతర ఆదాయాలు కూడా తగ్గనున్నాయి. దీంతో మే నెలలో సర్కార్ ఖజానాకు ఆదాయం బాగా తగ్గింది.