పెట్టుబడులకు హైదరాబాద్ దివ్య ఔషధం: మంత్రి కేటీఆర్ హైదరాబాద్ హెచ్ఐసీసీలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఏటా నిర్వహించే బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, నోవార్టిస్ వంటి పలు ప్రముఖ ఫార్మా కంపెనీల సీఈవోలు, లైఫ్ సైన్సెస్ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. స్విట్జర్లాండ్ ఈ సదస్సుకు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
బయో ఆసియా సదస్సులో భాగంగా ఏటా ఇచ్చే జీనోం వాలీ ఎక్సలెన్సీ అవార్డును యూఎస్ఏకు చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్జోన్స్కు అందజేశారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్‌తో హైదరాబాద్ వైబ్రంట్ లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టం ఎంవోయూ కుదుర్చుకున్నారు. బయోకాన్ పరిశోధక కేంద్రమైన సింజన్ హైదరాబాద్ ఫెసిలిటీని ఈ సదస్సులో ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫార్మా ప్రగతిని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ కాపిటల్‌గా ఎదుగుతోందని పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో సింహ భాగం మందులు, పేరెన్నికగన్న వ్యాక్సిన్ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచి ఉత్పత్తి జరగటం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ డివైస్ పార్క్‌లో ఫార్మా కంపెనీలు పని ప్రారంభించామని వెల్లడించారు.
దేశ ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లను ట్రాన్సఫర్మేటివ్, బ్రేక్‌త్రూ టెక్నాలజీలు పరిష్కారాలు చూపుతాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో స్టార్టప్‌లకు తమ ఉత్పత్తులను, మేథో సంపత్తి ప్రదర్శించడానికి ఇదో చక్కని వేదికని అన్నారు. లైఫ్ సైన్సెస్‌కు అతిపెద్ద క్లస్టర్‌గా జీనోం వ్యాలీ నిలుస్తోందని.. దాని విస్తరణకు మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు.