సులువుగా.. పారదర్శకంగా.. స్పష్టంగా ఉండే కొత్త రెవెన్యూ చట్టం సిద్ధమవుతోంది. తప్పు చేస్తే శిక్ష తప్పదని రెవెన్యూ ఉద్యోగులకు.. తప్పుడు సమాచారం ఇచ్చి భూమి కాజేసే అక్రమార్కులకు, వారికి వంతపాడే సాక్షులకు కటకటాలు తప్పవనే సంకేతం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టాన్ని రూపొందిస్తోంది.
రాష్ట్రంలో ఏటా 3.50 లక్షల మ్యుటేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడే ఎక్కువగా అవినీతి చోటుచేసుకుంటోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మ్యుటేషన్లు వాటంతట అవే పూర్తయ్యే విధానాన్ని తీసుకురానుంది. 90 శాతం వరకు ఆటోమేటిక్ మ్యుటేషన్ విధానంలో పూర్తవుతాయని భావిస్తోంది.
భూ యజమాని మ్యుటేషన్‌కు దరఖాస్తుతోపాటు అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారమిస్తే దండించేందుకు ఈ అఫిడవిట్ ఆధారమవుతుంది.. ప్రస్తుతం ఈ చట్టం ముసాయిదా సిద్ధమవుతోంది.విశ్వసనీయ సమాచారం మేరకు అందులోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉంటాయని తెలుస్తోంది.
21 ఛాప్టర్లతో కొత్త చట్టం?
ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలు, చట్టాలను అనుసరిస్తూనే బలమైన చట్టానికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. చట్టాల్లోని లోపాలను అవకాశంగా చేసుకుని కొందరు ఆటలాడుతుండగా.. న్యాయపరమైన వివాదాలతో కొందరు కాలాన్ని దొర్లిస్తున్నారు. రిజిస్ట్రేషన్, వారసత్వ బదిలీతోపాటు ఇతర ఉన్నతీకరణలకు వినియోగపడేలా కొత్త చట్టం రూపొందుతోంది. మొత్తం 21 లేదా 26 ఛాప్టర్లతో దీనిని తయారుచేయనున్నట్లు సమాచారం.
ఏ విచారణ లేకుండానే మ్యుటేషన్..
మ్యుటేషన్ విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నారు. ఇకపై ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. భూ క్రయవిక్రయాల అనంతరం దస్త్రాల్లో యజమాని పేరు మార్పిడి (మ్యుటేషన్) ఏ విచారణ, నోటీసుల జారీ లేకుండా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పూర్తయిన భూమికి సంబంధించిన దస్త్రాలు రిజిస్ట్రేషన్ అధికారి నుంచి తహసీల్దారుకు
చేరుతుంటాయి. తహసీల్దారు నోటీసులు జారీ చేస్తారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌ఓల ద్వారా విచారణ పూర్తయ్యాక మ్యుటేషన్ పూర్తవుతుంది. కొత్త విధానంలో ఆన్‌లైన్‌లో స్పష్టంగా సమాచారం ఉన్న భూములకు వెంటనే పూర్తి చేస్తారు. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునే యజమాని తాను ఇచ్చే సమాచారం సరైనదేనంటూ అఫిడవిట్‌ను సమర్పించాలి. ఒకవేళ ప్రభుత్వ స్థలాలు, వివాదాలు ఉన్నవి,
కొనుగోలుదారుకు స్థలం అప్పగింత పూర్తి కానివి, సర్వే నంబర్లు సరిపోలకపోవడం లాంటివి ఉంటే మాత్రం సాధారణ పద్ధతిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు.
తప్పుడు సమాచారం ఇస్తే కటకటాలే
ఒకరి భూమి ఒకరికి రాయడం, యజమాని ఒకరైతే మరొకరు తమదంటూ వివాదానికి రావడం లాంటివి పరిపాటి. ఇకపై ఇవేమీ చెల్లవు. భూ సంబంధమైన లావాదేవీలన్నింటికీ తహసీల్దారుకు దరఖాస్తు చేసే ముందే అఫిడవిట్ సమర్పించాలి. తప్పుడు సమాచారం సమర్పిస్తే భూ యజమానులు, సాక్షులను బాధ్యులను చేస్తారు.
దీంతోపాటు రిజిస్ట్రేషన్ సమయంలో పట్టాదారు పాసుపుస్తకం, భూమి పట్టా సమర్పించాలనే నిబంధన పెట్టనున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే భూ యజమానులు, తహసీల్దారు, లావాదేవిలో భాగస్వామ్యమైన సంస్థల బాధ్యులకు నాలుగేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమాన విధించేలా నిబంధనలు తీసుకురానున్నారు.
మరికొన్ని కీలక అంశాలివి..
* తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టరు నేతృత్వంలో ఉన్న రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు.
- ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే తహసీల్దారు కఠిన చర్యలు తీసుకోవచ్చు. జిల్లా కలెక్టర్లు సుమోటోగా కూడా చర్యలు తీసుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో ఆర్‌ఓఆర్ 1-బి తనిఖీ చేసుకుని పట్టా పూచీకత్తుగా పెట్టుకోకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. భూములను తనఖా పెట్టిన వారి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. మరోచోట తనఖా కుదరదు.
- రాష్ట్రంలో ఏటా 60 వేలమంది భూ యజమానులు మరణిస్తుండగా వారసత్వ బదిలీ సమస్యగా మారుతోంది. కొత్త చట్టం ద్వారా గడువులోపే ఆ ప్రక్రియ పూర్తిచేయకపోతే రెవెన్యూ సిబ్బందికి అపరాధరుసుం విధిస్తారు.
- గతంలో క్షేత్రస్థాయిలో ఎవరు సాగులో ఉన్నారు, యాజమాన్యం మారిందా అనేది జమాబందీ ప్రక్రియ ద్వారా గుర్తించి రెవెన్యూ మాతృ దస్త్రాలు, పహాణీలో మార్పులు చేసేవారు. ఇకపై పహాణీ ఉన్నతీకరణ, గ్రామ ఖాతా నిర్వహణ ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి.
- రాష్ట్రంలో ఏర్పడే భూ వివాదాల్లో యాభై శాతం సరిహద్దులకు సంబంధించినవే. ఈ సమస్యలను ఆర్డీవోలు పరిష్కరించనున్నారు.
- వ్యవసాయ భూముల లీజు ఒప్పందాలను ఆరునెలలకే అనుమతిస్తారు.
శక్తిమంతమైన చట్టం
ఏ రాష్ట్రంలో లేనట్లుగా తెలంగాణలో 151 రకాల రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వాటిలో వినియోగంలో ఉన్నవి 38 మాత్రమే. చట్టాలకు ఇప్పటి వరకు 81 సవరణలు తీసుకొచ్చినా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నా ముందడుగు పడటం లేదు. తాజాగా ప్రభుత్వం శక్తిమంతమైన కొత్త చట్టం తీసుకురావాలని తలపెట్టింది.
అక్రమార్కుల ఆటలు సాగవు: కొత్త రెవెన్యూ చట్టానికై ప్రభుత్వ కసరత్తు ఇదీచూడండి.. నేడు 'యూఎస్ఐఎస్పీఎఫ్' సదస్సులో ప్రసంగించనున్న మోదీ