LAND POOLING: పట్ణణ ప్రాంతాల ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పాటు ఆర్థిక స్వయం సమృద్ధి లక్ష్యంగా భూములను సమీకరించి.. అభివృద్ధి చేసే కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ల్యాండ్ పూలింగ్, మానెటైజేషన్ విధానంలో భూములు సమీకరించి.. అభివృద్ధి చేసే దిశగా సిద్ధమవుతోంది. హెచ్ఎమ్డీఏతో పాటు నగర పాలికలు, జిల్లా కేంద్రాల్లో ఆ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ల్యాండ్ లూపింగ్ విధానం అమలు అవకాశాలు అన్వేషించడం సహా విధి విధానాలు రూపొందించాలన్న రాష్ట్ర మంత్రివర్గ ఆదేశాల మేరకు పురపాలక శాఖ గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ల్యాండ్ పూలింగ్పై జరిగిన ప్రత్యేక కార్యశాలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్కు.. వివిధ రాష్ట్రాల్లోని భూ సమీకరణ విధానం, ఇతర విధానాల రూపకల్పన సహా అక్కడ వచ్చిన ఫలితాలను అధికారులు వివరించారు. ప్రణాళికబద్ధ ఆవాసాల నిర్మాణంలో.. గుజరాత్, మహారాష్ట్ర అభివృద్ధి చేసిన విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. అక్కడి విధానాలు, అనుభవాల ఆధారంగా.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముంబైలోని ధారవి, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్ వంటి ప్రాంతాల్లో అమలు చేసినట్లుగా రాష్ట్రంలో భూ సమీకరణకు ప్రత్యేక విధానం తీసుకు రావాలని ప్రతిపాదించారు. అవసరమైతే.. ప్రత్యేక చట్టాన్ని తేవాలని సూచించారు.
ముందుగా కొన్నిచోట్ల.. తర్వాత అన్నిచోట్లా..
రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్ఎమ్డీఏ పరిధిలో మాత్రమే ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రాజెక్టులు చేపట్టారు. ఇటీవలే లేమూరు, ఇన్ముల్నర్వ, దండుమైలారం బోగారంలో 565 ఎకరాల విస్తీర్ణంలో భూ సమీకరణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హెచ్ఎమ్డీఏ పరిధితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లోనూ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముందుగా కొన్ని చోట్ల ఈ విధానాన్ని అమలు చేసి.. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కనీసం 20 పట్టణాల్లో ఆ విధానంలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.