తెలంగాణ

telangana

ETV Bharat / state

'పక్కా సమాచారం ఇస్తే... మౌలిక వసతులు సమకూరుతాయ్' - ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల బాగుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులు కేటాయించింది. జిల్లాలోని పాఠశాలల స్థితిగతులపై విద్యాశాఖ ఇచ్చే నివేదికల కోసం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వరకు ప్రతి పాఠశాల సమాచారం ఆన్​లైన్​లో పొందుపరచాలని సూచించారు. తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

the-government-is-funding-the-provision-of-infrastructure-for-government-schools
'పక్కా సమాచారం ఇస్తే... మౌలిక వసతులు సమకూరుతాయ్'

By

Published : Mar 30, 2021, 8:26 AM IST

*కొడంగల్‌ పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలోని ఐదు తరగతుల్లో 131 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాల ప్రహరీ శిథిలమైంది. తరగతి గదుల్లో పెచ్చులూడుతున్నాయి. నేలపై ఉన్న బండలు పగిలి పోతున్నాయి. పురుగులు ఆ బండల్లో చేరుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* బొంరాస్‌పేటలో ప్రాథమిక పాఠశాల, బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, ఉర్దూమాధ్యమ బడి, రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. భగీరథ నీటి కనెక్షన్లు లేకపోవటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని ఇలాంటి సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో బడుల బాగుకు రూ.4 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలల స్థితిగతులపై విద్యాశాఖ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు సమగ్ర నివేదికల కోసం ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల ఆధారంగా నిధులొచ్చే అవకాశాలు ఉండటంతో జిల్లా విద్యాశాఖ పక్కా సమాచారం సేకరించే పనిలో ఉంది. ఈ నెల 30 వరకు ప్రతి పాఠశాల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గడువు విధించారు.

కేటాయింపులు లేకపోవడంతో...

జిల్లాలో 748 ప్రాథమిక, 118 ప్రాథమికోన్నత, 156 ఉన్నత పాఠశాలలు, 18 కస్తూర్బా విద్యాల యాలున్నాయి. వీటిలో సుమారు 1.10 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఐదారు ఏళ్లుగా కొత్తగా పాఠశాల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వసతి, సౌకర్యాలు లేక పోవటంతో ఇరుకుగా కూర్చుంటున్నారు. చాలా బడుల్లో వరండాల్లో తరగతులు కొనసాగుతున్న పాఠశాలలు ఉన్నాయి. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థలో ఉండగా గత్యంతరం లేకపోవటంతో అందులోనే చదువులు సాగుతున్నాయి.

ఆశలు చిగురించాయి...

అనేక బడుల్లో అవసరమైన శౌచాలయాలు, తాగునీరు, ప్రహరీ, విద్యుత్తు, బల్లాలు, కంప్యూటరు గది, సైన్స్‌ ల్యాబ్‌ తదితర మౌలిక వసతులు లేని పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిని సమకూర్చేందుకు నిధులు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో ఆశలు చిగురించాయి. ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన సమాచారమే నిధుల విడుదలకు కీలకమని భావించడంతో వాస్తవమైన సమాచారం తీసుకోవటానికి కృషి చేస్తున్నారు. ప్రతి పాఠశాలలోని సమస్యలను తెలుసుకునేందుకు 53 అంశాలతో కూడిన వివరాలను ప్రధానోపాధ్యాయులు పూర్తి చేసి జిల్లా విద్యాశాఖకు పంపించాలి. సమాచారం ఆధారంగా పరిశీలించి నిధులు అందిస్తారు. అందులో తప్పడు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నివేదికలు వచ్చిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యక్ష్య తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు.

పక్కా సమాచారమిస్తే ప్రయోజనం

ప్రభుత్వం అవకాశాలు కల్పించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుకాదేవి సూచించారు. ఇప్పటికే జూమ్‌ సమావేశంతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే విధానంపై అవగాహన కల్పించామని వెల్లడించారు. ప్రతి పాఠశాల నుంచి అక్కడున్న సమస్యలు, ఇబ్బందులు తెలియజేస్తూ పక్కా సమాచారం ఇవ్వమని కోరామని.. ఉపాధ్యాయులు పక్కాగా సమాచారం ఇవ్వాలన్నారు. తప్పుడు వివరాలు అందిస్తే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.

ఇదీ చూడండి:అబ్కారీ శాఖలో పదోన్నతులు, బదిలీలు మరింత జాప్యం

ABOUT THE AUTHOR

...view details