కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో ఏపీ అధికారులు ఉన్న నేపథ్యంలో కమిటీ ఇచ్చే నివేదికపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని అందులో పేర్కొన్నారు.
ఏపీలో కృష్ణా బోర్డు బృందం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం
19:09 August 12
బృందంలో ఏపీ అధికారులు ఉండడంపై ప్రభుత్వం అభ్యంతరం
తాము ఫిర్యాదుదారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం వెంట తీసుకెళ్లాలని బోర్డు ఛైర్మన్‌ను కోరామన్న రజత్ కుమార్... అయితే తటస్థులు మాత్రమే వెళ్లాలన్న కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఛైర్మన్... ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని అన్నారు. ఈనెల 11న రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో కృష్ణా బోర్డు బృందం పాటు ఏపీ ఈఎన్సీ, సీఈలు ఉన్నారని... బృంద సభ్యులతో మాట్లాడటంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని లేఖలో తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కేఆర్ఎంబీ ఇచ్చే నివేదిక నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ లేఖలో పేర్కొంది. ఏపీ అధికారుల చర్యలు కృష్ణా బోర్డు బృందాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. లేఖ ప్రతులను కేంద్ర జలశక్తి శాఖా మంత్రి కార్యాలయం, కార్యదర్శికి కూడా రజత్ కుమార్ పంపారు.
ఇవీ చూడండి: