హైదరాబాద్ జంటనగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కొత్తవేం కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో నగర ప్రయాణమంటే వాహన దారులకు ఇబ్బందులు సర్వసాధారణం. రోజూ కొత్త వాహనాల సంఖ్య పెరగడం.. సొంత వాహనాల వాడకం అధికం కావడం వల్ల రద్దీ అధికమవుతోంది. ప్రధాన రోడ్లపై ఈ సమస్య రెట్టింపవుతుంది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం లింక్ రోడ్లకు శ్రీకారం చుట్టింది. లింక్ రోడ్ల వల్ల జంక్షన్లలో ట్రాఫిక్ తగ్గించడంతో పాటు.. ప్రయాణ దూరం సగానికి పైగా తగ్గుతుందని అంచనా వేసింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. మేయర్ బొంతు రామ్మోహన్ లింక్‌రోడ్ల నిర్మాణంపై హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్), జీహెచ్ఎంసీ సంయుక్తంగా లింక్‌రోడ్లను అభివృద్ధి చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 126.2 కిలోమీటర్ల మేర లింక్రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొదటి దశలో 44.7 కిలో మీటర్ల పనుల్లో భాగంగా.. భూసేకరణ తదితర అవసరాలకు రూ.313 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 37 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.