దళితబంధు పథకం (Dalita Bandu) కింద లబ్ధిదారులు పది రోజుల్లోనే ప్రతిఫలం పొందేలా యూనిట్లకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అమలు చేస్తున్నవాటిలో రెండు, మూడు యూనిట్లను కలిపి ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతోంది. ఒక యూనిట్‌కు అనుమతిస్తే ఇతరులపై ఆధారపడకుండా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన యంత్రాలు, వాహనాలు సమకూర్చనుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు పెట్టుబడి సహాయం చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రాంతాలకు తగినట్లు 47 పథకాలు రూపొందించింది.
చిన్న, చిన్న యూనిట్లు కాకుండా ఒక యూనిట్‌ను ప్రారంభిస్తే కనిష్ఠంగా పది రోజులు, గరిష్ఠంగా నెల రోజుల్లో మంచి ప్రతిఫలం దక్కేలా సిద్ధం చేయాలని ఇటీవల దళిత సాధికారత అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా రోడ్డుకు అభిముఖంగా ఇల్లు ఉంటే.. వారికి రూ. 10 లక్షల ఖర్చుతో మడిగలు నిర్మించి ఇవ్వాలని, అందులో దుకాణాలు నడిపేలా ఫర్నిచర్‌ను సిద్ధం చేయాలన్నారు. చిన్న దుకాణాలు నిర్మించి ఇస్తే సత్వరమే అద్దె రూపంలో కుటుంబానికి ఆదాయం అందుతుందని భావిస్తున్నారు.
రేషన్ కార్డులే ఆధారం..
హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టనున్న నమూనా పథకంలో అర్హులైన ఎస్సీ కుటుంబాలకు నేరుగా రూ. 10 లక్షల చొప్పున లబ్ధి చేకూర్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో అధికారులు మండల, గ్రామ స్థాయిల్లో ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం, యూనిట్ల గురించి అవగాహన కల్పిస్తారు. పౌరసరఫరాల శాఖ వద్ద రేషన్ కార్డుల వివరాలు ప్రకారం పథకాలు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆహార భద్రత కార్డు లేకుంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు రెండో వారానికి దరఖాస్తు పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్సీ కుటుంబాలు ఆహార భద్రత కార్డు వివరాలను పోర్టల్‌లో నమోదు చేయగానే ఆ కుటుంబంలోని సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు నమోదవుతాయి. ఆ మేరకు 47 యూనిట్‌లలో ఏదో ఒకటి ఎంచుకుని వివరాలు సమర్పిస్తే దరఖాస్తు పూర్తవుతుంది.