వినాయక నిమజ్జనం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్, గ్రేటర్‌లోని ఇతర జలశయాల్లోనూ నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని పలు కాలనీల్లోని మండపాల్లో సుమారు లక్షకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందులో 90 శాతం పీఓపీ విగ్రహాలే పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ 90 శాతం విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు.. ఇతర జలశయాల్లో నిమజ్జనం చేసేందుకు అనుమతి లేదు. ఈ అంశంపై పునః సమీక్షించాలని జీహెచ్ఎంసీ పిటిషన్ దాఖలు చేసినా.. హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. వేలాది విగ్రహాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. వాస్తవ పరిస్థితులను సుప్రీంకోర్టుకు వివరించి నిమజ్జనానికి అనుమతి కోరాలని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది.
Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి హైకోర్టు నో.. సుప్రీంకు సర్కార్! - ganesh immersion latest news
హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. నగరంలో నిర్మించిన 25 నీటి కొలనుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే ఈ బేబి పాండ్స్‌ను వినియోగిస్తున్నారు. గణేశ్ నిమజ్జనం, బతుకమ్మ నిమజ్జనానికి మాత్రమే వీటిని వాడుతారు. ఈ బేబి పాండ్స్‌లో కొన్ని పనిచేస్తుండగా.. మరికొన్ని పాడైపోయి ఉన్నాయి. యుద్ధప్రాతిపాదికన జీహెచ్ఎంసీ అధికారులు బేబి పాండ్స్‌ను బాగుచేయిస్తున్నారు. కానీ బేబి పాండ్స్‌లో ఎత్తు తక్కువ ఉన్న విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో... పెద్ద విగ్రహాలు ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు విగ్రహాలను నీటి కుంటలకు తరలించేందుకు అవసరమైన రోడ్డు మార్గాలు, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: Ganesh immersion: గణేశ్ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ