విశాఖలో 6 వేలకు పైగా ఎకరాల భూ సమీకరణ ఏపీలోని విశాఖలో పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చేందుకు భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 10 మండలాల్లో లాండ్ పూలింగ్ ద్వారా 6,116.50 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం భూ సమీకరణ ప్రక్రియ అంతా విశాఖ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని నిర్దేశించింది. వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ భూమిని అభివృద్ది చేసి తిరిగి కలెక్టర్‌కి అప్పగిస్తే, ఆ భూమిని పేదల ఇళ్లపట్టాల కోసం వినియోగిస్తారని ఉత్తర్వుల్లో వివరించారు. వారం రోజుల్లోగా ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని.. ఐదునెలల్లోగా అభివృద్ధి చేసిన భూమిని పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం తెలిపింది.
అత్యధికంగా అనకాపల్లిలో
ఒక్క విశాఖ జిల్లాలోనే లక్షా 50 వేల 584 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 1452.87ఎకరాలను సమీకరించనున్నారు. భీమునిపట్నంలో 486 ఎకరాలు, పద్మనాభం మండలంలో 515 ఎకరాలు, సబ్బవరం మండలంలో 1373.87 ఎకరాలు, ఆనందపురం మండలంలో 114.40 ఎకరాలు సమీకరించనున్నారు. పరవాడలో 343 ఎకరాలు, గాజువాకలో 88 ఎకరాలు, పెదగంట్యాడలో 159 ఎకరాలు తీసుకోనున్నారు. విశాఖ గ్రామీణంలో అతి తక్కువగా కేవలం 96.40 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. మొత్తం సేకరించాల్సిన భూమిలో 2552.33 ఎకరాలు అసైన్డ్ భూమికాగా, పీవోటీ భూమి 464.60 ఎకరాలు, ఆక్రమణలలో ఉన్న భూమి 2,343.98 ఎకరాలు, ఖాళీ భూమి 755.59 ఎకరాలు సమీకరించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. మొత్తంగా విశాఖ జిల్లాలో 6,116 ఎకరాలను సమీకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
భూసమీకరణ కింద తీసుకునే వాటిలో గరిష్ఠంగా డీపట్టా భూములే ఉన్నందున... వారికి ఆమోదయోగ్యమైన ప్యాకేజీని సిద్ధం చేశారు. అసైన్డ్ భూములకు ఎకరాకు 900 గజాలు, పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు... ఐదు నుంచి పదేళ్ల లోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు చొప్పున తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం విధివిధానాల్లో పేర్కొంది. అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇదీచూడండి.విశాఖలో మరో కీలక అడుగు