తెలంగాణ

telangana

ETV Bharat / state

పుస్తక ముద్రణ, విక్రయానికి మళ్లీ వారికే అవకాశం

రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీ, విక్రయానికి... గతంలో ఎంపికైన 21 మంది ప్రైవేటు గుత్తేదారులకే మరోసారి అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ టెండరు కమిటీ ఆమోదించిన ధరల మేరకు గతేడాది మిగిలిపోయిన పుస్తకాలు విక్రయించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠ్యపుస్తకాల ముద్రణపై విద్యాశాఖ ఉత్తర్వులు
పాఠ్యపుస్తకాల ముద్రణపై విద్యాశాఖ ఉత్తర్వులు

By

Published : Jun 25, 2021, 12:34 PM IST

పాఠశాలల విద్యార్థులకు విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీ కాంట్రాక్టు గతేడాది గుత్తేదారులకే మరోసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరిస్థితుల కారణంగా టెండర్లను పిలవకుండా 21 మంది పాత గుత్తేదారులకే అప్పగిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిషర్లు, ముద్రణాసంస్థలు ఖరారు కాకపోవడంతో మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు.

ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించగా... జులై 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో పాత గుత్తేదారులకే అప్పగించారు. గత విద్యా సంవత్సరంలో మిగిలిన పాఠ్యపుస్తకాలను పాత ధరలకే ఈ ఏడాది విక్రయించేందుకు సైతం పబ్లిషర్లకు విద్యా శాఖ అనుమతినిచ్చింది.

విపత్కర పరిస్థితుల్లో..

సాధారణ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ఆరంభానికి పది రోజులు ముందుగానే పాఠ్య పుస్తకాలు చేరుకుంటాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల వారీగా అందిస్తుంటారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఈసారి జాప్యం ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే వచ్చిన పుస్తకాల నుంచి గురుకులాలకు సరఫరా చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. పాఠశాలలు ఆరంభమైన రోజు నుంచే నిర్దేశిత విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

క్యూఆర్‌ కోడ్‌లు మరింత విస్తృతంగా..

కొవిడ్‌ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సారి డిజిటల్‌ విధానంలో విద్యార్థులకు పాఠాలు మరింత చేరవ కానున్నాయి. పాఠ్య పుస్తకాల్లోని అంశాలకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌లను చరవాణి ద్వారా స్కాన్‌ చేస్తే వీడియో రూపంలో పాఠాలు ప్రదర్శితం కానున్నాయి. గతంలోనే ఈ విధానం ఉన్నప్పటికీ గత విద్యా సంవత్సరం నుంచి మరింత విస్తృతం చేశారు. ఫలితంగా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలకు సులువుగా అర్థం కానున్నాయి.

ఇదీ చదవండి:చదువులమ్మ ఒడి.. సాయానికి నిలబడి..

ABOUT THE AUTHOR

...view details