తెలంగాణ ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మంగళవారం రూ.4000 కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా బాండ్లను విక్రయించింది. 13 ఏళ్ల కాలపరిమితితో వీటిని వేలం వేసింది. కేంద్ర ఆర్థికశాఖ కొత్త నిబంధనలు, రుణాలపై ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయానికి తొలుత అనుమతి లభించలేదు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక ప్రాతిపదికన అనుమతించడంతో రాష్ట్ర ప్రభుత్వం గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి మంగళవారం బాండ్లను విక్రయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.59,632 కోట్ల రుణాన్ని సమీకరించుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇందులో బాండ్ల వేలం ద్వారా రూ.55,530 కోట్లు పొందాలని పేర్కొంది. కానీ కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనివిగానే పరిగణించనున్నట్లు పేర్కొంది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న రుణాల ప్రాతిపదికన ప్రస్తుత ఏడాది రుణపరిమితిని నిర్ణయించనున్నట్లు కేంద్రం లేఖ రాయగా, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు దిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి తమ వాదన వినిపించారు. కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వివరాలు అందించారు. దీంతో గత వారం రూ.4,000 కోట్ల బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతించింది. జూన్ నెలాఖరు వరకు రూ.11 వేల కోట్ల రుణ సమీకరణను రాష్ట్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.