ఫిర్యాదులు అందిన ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ
11:53 June 05
జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరుగుతున్న బోర్డు తొమ్మిదో సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు అందిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. గతంలో ఇరురాష్ట్రాలు చేసిన ఫిర్యాదులతో పాటు కాళేశ్వరం, సీతారామ, దేవాదుల మూడో దశ, తుపాకులగూడెం, పెన్‌గంగపై ఆనకట్టలు, వాటర్ గ్రిడ్, రామప్ప-పాకాల మళ్లింపు పథకాలపై ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఫిర్యాదులు చేసింది.
ఈ నేపథ్యంలో ఫిర్యాదులు అందిన ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌ల విషయమై భేటీలో చర్చ జరగనుంది. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ, టెలిమెట్రీ ఏర్పాటు సహా బోర్డు పాలనాపరమైన అంశాలపై చర్చ జరగనుంది. గోదావరి జలాలు కృష్ణాకు తరలిస్తోన్న జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా పెంపు అంశాలను సమావేశంలో తెలంగాణ లేవనెత్తే అవకాశం ఉంది.