తెరాస: లోటుపాట్లకు ఆస్కారం లేకుండా..
బల్దియాలో మొత్తం 150 డివిజన్లు ఉంటే 2016లో తెరాస 99 దక్కించుకుంది. ఈసారి పదిస్థానాలు కాస్త అటుఇటూగా డివిజన్లను గెలవబోతున్నట్లు అగ్రనేతలు చెబుతున్నారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా లోటుపాట్లను అధిగమించాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. గత ఐదేళ్లలో కొందరు కార్పొరేటర్లపై ఆరోపణలు వచ్చాయి. తమ డివిజన్‌లో ఎవరైనా ఇళ్లు నిర్మిస్తే చాలు వసూలు చేశారన్న విమర్శలున్నాయి. జనామోదం ఉన్న అభ్యర్థులనే నిలపాలని యోచిస్తున్నారు. తలసాని, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు డివిజన్ల వారీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. అలానే లబ్ధిదారులకు కనీసం 40 వేల ఇళ్లను పంపిణీ చేసే లక్ష్యంతో ఉన్నారు.
భాజపా: దూకుడుగా ముందుకు
ప్రస్తుత పాలకవర్గంలో భాజపా కార్పొరేటర్లు నలుగురే. ఈసారి పీఠం మీదే పార్టీ కన్నేసింది. రాజధానిని పార్టీ పరంగా ఆరు జిల్లాలుగా చేసి ఆరుగురికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి జిల్లాకు ఒక్కో అగ్రనేతను ఇన్‌ఛార్జిగా పెట్టనున్నారు. డివిజన్ల వారీగా చురుగ్గా ఉండే నాయకులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించబోతున్నారు. కొన్ని స్థానాలను జనసేన పార్టీకి ఇవ్వడం ద్వారా తమకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.