తెలంగాణ

telangana

ETV Bharat / state

వేకువజామున పలావ్‌ పొగలు.. హైదరాబాద్​లో ఇప్పుడు ఇదే ట్రెండ్

special food in Hyderabad: ఉదయాన్నే ఇరానీ ఛాయ్‌.. మధ్యాహ్నం బిర్యానీ.. సాయంత్రం సెగలు కక్కే కాఫీ.. రాత్రికి పసందైన రోటీ¨తో చికెన్‌.. భాగ్యనగరంలో పూటపూటకు సరికొత్త రుచులు పలకరిస్తుంటాయి. ప్రతి వీధిలో ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. ఇప్పుడు నగరవాసుల జాబితాలో వేకువజాము పలావ్‌ సరికొత్త రుచిగా మారింది. హైటెక్‌ సిటీ ప్రాంతంలో పురుడుపోసుకున్న ఈ తరహా పోకడ క్రమంగా విస్తరిస్తోంది. ఓ యువకుడి ఆలోచన ఎంతోమందిని ఆకర్షిస్తోంది.

special dishes
special dishes

By

Published : Nov 20, 2022, 8:35 AM IST

special food in Hyderabad: మాదాపూర్‌కు చెందిన బి.సత్యనరేన్‌ కలినరీ ఆర్ట్స్‌లో పీజీ డిప్లొమా చేశారు. తండ్రి అజయ్‌కుమార్‌ స్ఫూర్తితో క్యాటరింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో రాత్రి షిఫ్టుల దృష్ట్యా అర్ధరాత్రి వరకు ఆహారానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. బిర్యానీ, రోటి వంటివే ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ ఆలోచనతో తెల్లవారుజామున పలావ్‌ అందించాలని నరేన్‌ భావించారు. నాలుగు నెలల కింద అయ్యప్ప సొసైటీ వద్ద యాదాద్రి మిలటరీ రుచులు పేరిట తెల్లవారుజాము 3 నుంచి 5.30 గంటల వరకు నడిచేలా పలావ్‌ హోటల్‌ ప్రారంభించారు. వీరి హోటల్‌ కేవలం శుక్ర, శని, ఆదివారాల్లోనే నడుస్తుంది.

శాకాహారులకు ప్రత్యేకంగా:మాంసాహారుల కోసం చికెన్‌, మటన్‌ పలావ్‌ అందిస్తుంటారు. శాకాహారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరి కోసం పుట్టగొడుగుల పలావ్‌ వండి ఇస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో మిలటరీ హోటల్‌ అంటే మాంసాహార భోజనం అందిస్తుంటారు. దీనికి తగ్గట్టుగా హోటల్‌ పేరులో మిలటరీ రుచులు అని పెట్టారు.

ఐస్‌క్రీమ్‌ను వేయించి తింటే:ఐస్‌క్రీమ్‌ ఏ మాత్రం ఆలస్యం చేసినా.. కరిగిపోతుంది. దీనిని ఫ్రై చేస్తే ఉంటుందా?.. నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫ్రైడ్‌ ఐస్‌క్రీమ్‌ అందిస్తున్నారు. దీన్ని రుచి చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీని తయారీ విధానం భిన్నంగా ఉంటుందని బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌ చెఫ్‌ వివరించారు. వివిధ రకాల పదార్థాలు వాడుతూ.. ఐస్‌క్రీమ్‌ వేసి నూనెలో వేయించి అందిస్తుంటారు. బంజారాహిల్స్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ఈ తరహా ఫ్రైడ్‌ ఐస్‌క్రీములను సందర్శకులకు వడ్డిస్తున్నారు. దీన్ని రుచి చూసేందుకు ఆహారప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.

"వ్యాపారం తరహాలో కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో హోటల్‌ ప్రారంభించాం. పలావ్‌ వండేందుకు గానుగ నూనె, నెయ్యి వినియోగిస్తుంటాం. అందుకే తెల్లవారుజామున తిన్నా.. ‘ఎక్కువ మోతాదు’ అయ్యిందనే భావన ఉండదు. వారాంతాల్లో నిర్వహిస్తుంటాం. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది".- సత్యనరేన్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details