భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. మొదటి విడతలో హెచ్ఎండీఏ, టీఎస్-ఐఐసీకి చెందిన 64.93 ఎకరాల భూమిని విక్రయించనుంది. హెచ్ఎండీఏకు చెందిన కోకాపేటలోని నియోపోలీస్ లేఅవుట్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో 49.92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 8 ప్లాట్లను విక్రయించనుంది. ఇక్కడ ఆరు ప్లాట్లు ఏడు, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. రెండు ప్లాట్లు మాత్రమే ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ టీఎస్-ఐఐసీకి హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లకు వేలం నిర్వహించనుంది. ఇక్కడున్న అన్ని ప్లాట్లు 2, 3 ఎకరాల చొప్పున విస్తీర్ణంలో ఉన్నాయి. ఎకరానికి కనీస వేలం ధర 25 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం... 20 లక్షల చొప్పుల వేలం పెంచుకోవచ్చని ప్రకటించింది. కనీస ధరకు భూముల విక్రయం జరిగినా.... 1623 కోట్లు ఖజానాకు చేరనున్నాయి.
భూములన్నీ బహుళ ఉపయోగ జోన్ కిందికి
ప్రస్తుతం విక్రయిస్తున్న భూములన్నీ బహుళ ఉపయోగ జోన్ కిందకు వస్తాయి. అంటే ఈ భూములను ఆఫీస్, ఐటీ, గృహ, విద్యా సంస్థలు, కమర్షియల్ వినియోగం కోసం ఉపయోగించుకోవచ్చు. స్థలాల విక్రయానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. భూముల వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ వెబ్ సైట్ ద్వారా జరగనుంది. మార్కెటింగ్ కన్సల్టెంట్గా సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించనుంది. కోకాపేట భూముల వేలానికి సంబంధించి ప్రిబిడ్డింగ్ సమావేశం ఈనెల 25న, టీఎస్-ఐఐసీ భూముల ప్రీ బిడ్డింగ్ సమావేశం 26న జరగనుంది. ఒక్క రోజు తేడాతోనే వేలం చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ భూముల వేలం జులై 15న, టీఎస్ఐఐసీ భూముల వేలం 16వ తేదీన జరగనుంది.