భారత వాయుసేన అమ్ములపొదిలో మరో కీలక ఆయుధం చేరింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే మధ్యశ్రేణి క్షిపణి (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్-ఎంఆర్‌సామ్) చేరికతో ఆయుధ సంపత్తి మరింత బలోపేతం అయింది. ఇజ్రాయిల్‌తో కలిసి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళంలో వీటిని ప్రవేశపెట్టారు. వాయుసేన కోసం సిద్ధం చేసిన తొలి క్షిపణి యూనిట్‌ను మంగళవారం తరలించారు.
ఈ వాహనానికి హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌లో డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్(క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) ఎం.ఎస్.ఆర్.ప్రసాద్ జెండా ఊపి సాగనంపారు. క్షిపణుల అభివృద్ధిలో నోడల్ సంస్థగా వ్యవహరించిన ఆర్‌సీఐ(రీసెర్చి సెంటర్ ఇమారత్) డైరెక్టర్ నారాయణమూర్తి, బీడీఎల్ సీఎండీ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్రా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.