తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్ని ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.. - మానవ తప్పిదాలు

హైదరాబాద్​ మహానగరంలో నిత్యం ఏదోమూల అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేసవి రావడంతో.. అవి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుదాఘాతం, మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు.. ప్రమాదాలకు ప్రధాన కారణం కాగా, పలు ముందస్తు జాగ్రత్తలతో ఆయా విపత్తులను అరికట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

the-fires-that-have-been-raging-for-the-past-few-days-are-disturbing-in-city
జాగ్రత్తలను పాటించండి.. అగ్ని ప్రమాదాలను అరికట్టండి

By

Published : Mar 23, 2021, 11:01 AM IST

Updated : Mar 23, 2021, 2:52 PM IST

హైదరాబాద్​లో గత కొన్ని రోజులుగా జరిగిన అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. విద్యుదాఘాతం, మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలతో తరచూ ఎక్కడోచోట ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల జరిగిన ఘటనలు

* పాతబస్తీ మీర్‌చౌక్‌ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగారు వస్తువుల తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.

* గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూలులో మంటలు చెలరేగాయి. సకాలంలో ఆర్పేయడంతో 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనాకు వచ్చారు. పాఠశాల రికార్డులు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి.

* ట్రూప్‌ బజార్‌లోని శానిటరీ దుకాణం గోదాంలో నిప్పంటుకుని మొదటి, రెండో అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

* కోఠి ఆంధ్రాబ్యాంకు కూడలి వద్ద ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో మరో 5 దుకాణాలూ కాలిపోయి ఆస్తినష్టం చోటుచేసుకుంది.

వాణిజ్య సముదాయాల్లో...

షాపింగ్‌మాల్స్‌లో దాదాపు 12 గంటల పాటు ఏసీలు, లైట్లు పనిచేయడం వల్ల అవి వేడెక్కి విద్యుదాఘాతంతో ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకమైన అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రులు, పాఠశాలల్లో సీసీ కాంక్రీట్‌ స్లాబ్‌లు మాత్రమే పైకప్పుగా ఉపయుక్తం. ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి.

మంటల్లో చిక్కితే...

ప్రమాదం జరిగిన సమయంలో మంటల్లో చిక్కితే కంగారు పడకుండా దగ్గరలో ఉన్న అత్యవసర ద్వారాలను గుర్తించాలి. ఆయిల్‌ వంటి ఉత్పత్తులు ఉన్న వైపు వెళ్లొద్ధు అగ్నిని ఆర్పే ఉపకరణాలు కనిపిస్తే వాటి సాయంతో బయటపడేందుకు ప్రయత్నించాలి. పొగ ముసురుకుంటే ముఖానికి తడి వస్త్రం అడ్డుపెట్టుకుని బయటకు రావాలి. దుస్తులకు మంటలు అంటుకుంటే నేలపై పడుకుని ఆరిపోయేలా దొర్లాలి. దుప్పటి అందుబాటులో ఉంటే చుట్టుకోవాలి.

గృహాల్లో ఏం చేయాలంటే...

స్టవ్‌ను నేల మట్టానికి వీలైనంత ఎత్తులో ఉంచి ఉపయోగించాలి. అగ్గిపెట్టెలు, కిరోసిన్‌ నిల్వలు దీనికి దూరంగా ఉంచాలి. వంట చేసే సమయంలో వదులుగా వేలాడే వస్త్రాలు ధరించొద్ధు సిలిండర్‌ వాల్‌ పైపును, రెగ్యులేటర్‌ను నిర్ణీత కాలపరిమితుల్లో తనిఖీ చేసి లోపాలుంటే మార్చాలి. వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి.

పరిశ్రమల్లో పరికరాలున్నాయా...

ప్రతి పరిశ్రమలో అగ్ని నిరోధక పరికరాలు ఉండాల్సిందే. ప్రమాదం జరిగినప్పుడు నీటిని చిమ్మడానికి ఫైర్‌ ఫిట్టింగ్‌ వ్యవస్థ అవసరం. భూగర్భ నీటిట్యాంకు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా పైపులైన్‌ ఉండాలి. ప్రమాదాలపై కార్మికులకు అవగాహన కల్పించాలి. ఇక గోదాముల్లో వస్తువుల నిల్వలను క్రమ పద్ధతిలో దూరంగా ఉంచాలి. గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా చూడాలి. రక్షిత ఉపకరణాలను అందుబాటులో ఉంచాలి.

ఇదీ చదవండి:తాళం చెవి తాడు.. ఆమె పాలిట ఉరితాడయ్యింది!

Last Updated : Mar 23, 2021, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details