రాష్ట్రంలో పడిన వర్షాలు వల్ల నష్టపోయిన రైతులు Trouble for farmers due to rain in TS: రాష్ట్రంలో ఆకస్మాత్తుగా పడిన వర్షాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాలలో వడగళ్ల వానకు మిరప, మామిడి, కూరగాయల తోటలు, మొక్క జొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొట్ట దశలోని వరి రాలిపోయినందున రైతులు దిగాలు చెందారు. లక్షలు పెట్టుబడి పెడితే అకాల వర్షాలు అశనిపాతంలా మారాయని వాపోయారు. కోత దశలోని మిరప పంట రంగు మారిందని మార్కెట్ తీసుకెళ్లినా పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
వందల ఎకరాల్లో పంటలు నీటితో మునిగాయి: జగిత్యాల గ్రామీణ జిల్లా చెల్గల్ సహా పలు గ్రామాల్లో వడగళ్లు, ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని పలు గ్రామాలలో వడగళ్లు, ఈదురు గాలులకు వరి, మొక్కజొన్న, పొగాకు పంటలు నేలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగడం వల్ల నిండా మునిగామన్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వరి, మామిడి దెబ్బతిన్నాయి. పొట్టకొచ్చిన వరి రాళ్ల వర్షంతో అపార నష్టం వాటిల్లింది. తిర్మలగిరి-తొర్రూరు ప్రధాన రహదారిపై చెట్లు కూలి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనగాం-సూర్యాపేట ప్రధాన రహదారిపై హోర్డింగ్ కూలడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, గుండాల, అల్లపల్లి మండలాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలతో పాటు సింగారం గ్రామంలో పిడుగుపాటుకు 13 పశువులు మృతి చెందాయి.
కనీసం పెట్టుబడులు వస్తాయో! రావో: మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాలో మామిడి పంట నేలరాలడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వందలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న వరి పంట దెబ్బతింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేల వాలాయి. మామిడి కాయలు నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో పిడుగు పాటుకు రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భారీ ఈదురు గాలులు, వడగళ్ల దెబ్బకు మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం పెట్టుబడులు వస్తాయా! రావోనని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: