తెలంగాణ

telangana

ETV Bharat / state

అభం శుభం తెలియని చిన్నారులపై 'విష' ప్రభావం - AP lg polymers news

ఏపీలో విశాఖ విషవాయువు సృష్టించిన విలయం వల్ల అధిక శాతం చిన్నారులు న్యుమోనియా, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో తల్లడిల్లుతున్నారు. ఏడాది పాటు వీరిని ప్రతినెలా పరీక్షించాలని వైద్యులు చెబుతున్నారు.

The effect of ongoing venom poisoning on children
చిన్నారులపై 'విష' ప్రభావం

By

Published : May 10, 2020, 10:07 AM IST

వారంతా అభం, శుభం ఎరుగని చిన్నారులు. విషవాయువు ధాటికి చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీతో తీవ్ర అస్వస్థతకు గురైనవారిలో 53 మంది పిల్లలున్నారు. వీరంతా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తొలి రెండు రోజుల కంటే ఆరోగ్యం కొంత కుదుటపడినా.. భవిష్యత్తులో విషవాయువు ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనే ఆందోళన బాధిత కుటుంబాల్లో కనిపిస్తోంది. వారి వద్దకు శనివారం నుంచి తల్లిదండ్రులు వస్తున్నారు. చిన్నారులు ప్రవల్లిక, జస్మిత్‌, సూర్య న్యుమోనియాతో బాధపడుతున్నారు. యోగేశ్​‌ కాలువగట్టు దాటుతూ పడిపోగా.. తలకు బలమైన గాయం తగిలింది. పిల్లలకు రెండురోజులు ద్రవాలే ఇచ్చారు. శనివారం కోలుకోగా.. ఆహారం అందించారు. ఈ తరహా ఘటనలు గతంలో రాకపోవడం వల్ల వైద్యులకు ఇది సవాలుగానే మారింది.

న్యుమోనియాతో అవస్థ

సూర్య న్యుమోనియాకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే ఘటనలో అతడి తల్లిదండ్రులూ అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురూ కేజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్నారు. తల్లి లావణ్య కోలుకోవడం వల్ల శనివారం బిడ్డ చెంతకు వచ్చారు. ప్రవల్లిక పరిస్థితీ దయనీయమే. వచ్చినరోజు నుంచి ఇబ్బందులు పడుతోంది. బాలికకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల పీఐఆర్‌సీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ఏడుగురు..

వెంకటాపురం వాసి యలమంచిలి రమేశ్​‌ కుటుంబంలో ఏడుగురు విషవాయువు ప్రభావానికి గురయ్యారు. వీరిలో ఆయన తల్లి అప్పలనర్సమ్మ మరణించారు. రమేశ్​‌, ఆయన భార్య శ్యామల, పిల్లలు జస్మిత, హాసిని నలుగురూ అస్వస్థతకు గురయ్యారు. తండ్రి, తమ్ముడు సైతం ఆసుపత్రిలో చేరారు. జస్మిత న్యుమోనియాకు గురవగా, హాసినికి జబ్బ, వీపు భాగంలో కాలిన మచ్చలు ఏర్పడ్డాయి.

యోగేశ్​‌ తలపై ఏడు కుట్లు..

ఇదే ప్రమాదంలో అస్వస్థతకు గురైన టి. యోగేశ్​కు తలపై తొమ్మిది కుట్లు పడ్డాయి. చేతులు, వీపుపై బలమైన గాయాలయ్యాయి. విషవాయువు ప్రభావానికి గురైన యోగేశ్​‌ చెరువుగట్టు దాటుతూ కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తలపై గాయం ఉండటం వల్ల 7 కుట్లు వేశారు. అతడి తల్లిదండ్రులు ప్రసాద్‌, జానకి కూడా కేజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్నారు.

ప్రతి నెలా పరీక్షించాలి

ప్రస్తుతం పిల్లలంతా కోలుకుంటున్నారు. ముగ్గురిలో న్యుమోనియా లక్షణాలు కనిపించాయి. మణిదీప్‌ అనే చిన్నారిని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు పంపాం. చిన్నారి తండ్రి మరణించడం వల్ల దహన సంస్కారాల కోసం ఇంటికి పంపాం. తిరిగి వచ్చాక మరికొన్ని పరీక్షలు చేస్తాం. ఏడాది పాటు వారి ఆరోగ్యస్థితిని ప్రతీనెలా పరీక్షించాలి. పిల్లలందరి వివరాలను నమోదు చేసుకుంటున్నాం.

- డాక్టర్‌ వేణుగోపాల్‌, పిల్లల విభాగాధిపతి, కేజీహెచ్‌

ఇవీ చదవండి...'ఆ ఘటన ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది'

ABOUT THE AUTHOR

...view details