తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔషధాల్లో ఎన్నివందల శాతం దోచేస్తున్నారో తెలుసా? - Drug controller news

షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటిపై ఎమ్మార్పీ ఎంతుండాలనేది ఆ సంస్థే నిర్ణయిస్తోంది. నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలను మాత్రం నియంత్రించడం లేదు. ఔషధ వ్యాపారంలో పెద్దఎత్తున దోపిడీకి ఇక్కడే బీజం పడుతోంది.

ఔషధ ధరల్లో ఉత్పత్తి సంస్థల మాయ
ఔషధ ధరల్లో ఉత్పత్తి సంస్థల మాయ

By

Published : Feb 17, 2021, 6:45 AM IST

Updated : Feb 17, 2021, 7:59 AM IST

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్యుడు ‘పాంటాప్రాజోల్‌ 40 ఎంజీ’ మాత్ర రాసిచ్చారు. సమీపంలో ఉన్న ఓ ఔషధ దుకాణానికి వెళ్తే ప్రముఖ ఉత్పత్తి సంస్థకు చెందిన 10 మాత్రలకు రూ.118 గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)గా పేర్కొని, అందులో సుమారు 10 శాతం తగ్గించి రూ.100 తీసుకున్నాడు. నిజానికి ఈ మాత్రల అసలు ఖరీదు రూ.13.15 మాత్రమే. అయినా రోగిపై రూ.80కి పైగా అదనపు భారం పడింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వేల ఔషధాల్లోనూ ఇదే తరహా దోపిడీ. ఔషధాల గరిష్ఠ చిల్లర ధరల్లో భారీ వ్యత్యాసాలతో సామాన్యుడు చితికిపోతున్నాడు. ఈ వ్యవహారంలో ఉత్పత్తి సంస్థ మొదలుకొని టోకు(హోల్‌సేల్‌/డీలర్‌), చిల్లర(ఔషధ దుకాణదారు) వర్తకులు, ఆసుపత్రులు, వైద్యులూ భాగస్థులవుతున్నారనే ఆరోపణలున్నాయి.

నాన్‌ షెడ్యూల్డ్‌ ముసుగులో..

కేంద్ర ప్రభుత్వం ఔషధాలను రెండు రకాలుగా విభజించింది. అధిక శాతం ప్రజలు ఎక్కువగా వినియోగించే తప్పనిసరి ఔషధాలను ‘షెడ్యూల్డ్‌ ఔషధాల’ జాబితాలో చేర్చింది. మొత్తం మందుల్లో కేవలం 460 (20 శాతం) రకాలే ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపు 27,321 (80 శాతం) ఔషధాలను ‘నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల జాబితా’లో ఉంచారు. ఇందులో గుండె, క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అతి ముఖ్యమైన మందులతో పాటు ఎసిడిటీ, అలర్జీలకు వినియోగించేవీ ఉన్నాయి.

ఔషధ ఉత్పత్తి సంస్థలు ‘నాన్‌ షెడ్యూల్డ్‌’ ఔషధాల ధరలను దాదాపు 1500 శాతం వరకూ అధికంగా ముద్రిస్తూ కొనుగోలుదారులను భారీగా ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఎసిడిటీ ఇంజక్షన్‌ను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. మాత్రలను తీసుకురాలేదు. ఒక్కో మాత్రకు రూ.4 నుంచి రూ.8 కూడా వసూలు చేస్తున్నారు. దీని అసలు ధర 40-50 పైసలు కూడా ఉండదు. 99 శాతం మంది ఎసిడిటీకి మాత్రలే వాడుతుంటారు. ఇంజక్షన్‌ను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాడతారు. మాత్రలనూ ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకువస్తేనే రోగులకు ప్రయోజనం ఉంటుంది.

దోపిడీ తీరిలా..

* సాధారణంగా ఉత్పత్తుల ధరలను ఏటా 10 శాతం చొప్పున పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల్లో ఈ విధానానికి స్వస్తిపలికారు. కొన్ని ఔషధాల ధర 1500 శాతం అధికంగా ఉంటోంది.
* ఐవీ సెట్‌, సూదులు, శస్త్రచికిత్సల్లో ఉపయోగించే వస్తువులనూ అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు.
* ఉత్పత్తి సంస్థలు తమ ఔషధాలు ధరల నియంత్రణ పరిధిలోకి రాకుండా ముందుగానే లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ధరల నియంత్రణ పరిధిలోకి వస్తే.. ఆ ఔషధానికి మరో సాధారణ ఔషధాన్ని మిళితం చేసి కొత్త ఉత్పత్తి పేరిట విపణిలోకి తీసుకొస్తున్నాయి.
* వైద్యులనూ ప్రలోభాలకు గురిచేస్తూ.. తమ మందులే రోగులకు రాసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఖరీదైన తమ ఔషధాలను రెండింటిని అమ్మితే.. ఒకటి ఉచితంగా ఇస్తామంటూ టోకు వ్యాపారులను ప్రలోభపెడుతున్నాయి.

అడ్డూఆపూ లేని కార్పొరేట్‌ ఆసుపత్రులు..

కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మందుల దోపిడీకి అడ్డూఆపూ ఉండడం లేదు. చిల్లర దుకాణాల్లో గరిష్ఠంగా 20 శాతం తగ్గిస్తారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎంత ధర ఉంటే అంత చెల్లించాల్సిందే. పైగా కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధ కేటగిరీల్లో అత్యవసర రోగులకు వినియోగించే ఔషధాలను తమకు సంబంధించిన సంస్థ పేరిట సొంత ఉత్పత్తులుగా కొనుగోలు చేస్తున్నాయి.

వాటి ఎమ్మార్పీని అవే నిర్ణయించుకుంటున్నాయి. ఉదాహరణకు డయాలసిస్‌ రోగులకిచ్చే ‘ఎరిథ్రోపొయిటిన్‌ ఇంజక్షన్‌’పై ఎమ్మార్పీని రూ.1400 వరకూ ముద్రిస్తున్నాయి. ఈ ఇంజక్షన్‌ అసలు ధర రూ.150 మాత్రమే. రోగికి సెప్టిసేమియా వంటి తీవ్ర రక్త ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు.. ‘మెరోపెనమ్‌’ ఇంజక్షన్‌ ఇస్తుంటారు. దీని వాస్తవ ధర రూ.224 మాత్రమే కాగా.. రూ.4వేల వరకూ వసూలు చేస్తున్నారు.

ధరల వ్యత్యాసం తగ్గాలి..

అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం,

షధాల ఎమ్మార్పీని ఉత్పత్తి సంస్థలే తగ్గించాలి. వాస్తవ ధరకు, ఎమ్మార్పీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దు. దీనివల్ల సాధారణ దుకాణదారులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏ ఔషధాన్ని అమ్మినా 20-30 శాతం లాభమే వస్తుంది. ఎక్కువ లాభం పొందేది మాత్రం ఔషధ సంస్థలు, ఆసుపత్రులే. ఆసుపత్రుల్లో రోగులకు వినియోగించే అధిక శాతం ఔషధాల ఎమ్మార్పీలో భారీ వ్యత్యాసం ఉంటోంది. సామాన్యునిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

-అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం, జీహెచ్‌ఎంసీ

అవగాహన లేక నష్టపోతున్న కొనుగోలుదారులు..

పి.ఆర్‌.సోమానీ, నిజామాబాద్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడు

మందులపై సరైన అవగాహన లేక కొనుగోలుదారులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. ధరలు తగ్గించాలని నేను చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే జాతీయ ఔషధ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల క్యాన్సర్‌ చికిత్స ఔషధాల ధరలను తగ్గించారు. త్వరలోనే ఇతర ఔషధ ధరలనూ నియంత్రించే అవకాశం ఉంది.

-పి.ఆర్‌.సోమానీ, నిజామాబాద్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడు

వ్యత్యాసాలు

ఇదీ చదవండి:జోరందుకున్న 'మండలి' సన్నాహక సమావేశాలు

Last Updated : Feb 17, 2021, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details