విశిష్టమైన చెట్లను నాటి భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ (Mp Santhosh Kumar) విజ్ఞప్తి చేశారు. రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టును ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే వినూత్న కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) చేపట్టనుందని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy), ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) చేతుల మీదుగా సంతోశ్ కుమార్ ఆవిష్కరించారు.
జమ్మిచెట్ల ప్రతిష్ఠ పెంచేలా..
వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ఠ కలిగిన చెట్టుగా... భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. పలు కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో... ప్రతి గుడిలో ఉండేలా ఈ నినాదాన్ని అందుకున్నామని సంతోశ్ తెలిపారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.