Consumer Commission: పాలసీదారుకు అంగవైకల్యం ఉన్నా.. బీమా పాలసీలో పేర్కొన్న మేరకు మరణానంతర ప్రయోజనాలను చెల్లించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్‌ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వరంగల్‌కు చెందిన మీరా హుస్సేన్ 2013లో రూ.2.20 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నారు. దీని ప్రకారం పాలసీదారు మరణానంతరం బీమా సంస్థ రూ.8.80 లక్షలు చెల్లించాలి. అదే సంవత్సరంలో గుండెపోటుతో మీరా హుస్సేన్ చనిపోగా బీమా సంస్థ ఆయన భార్యకు కనీస బీమా మొత్తం రూ.2.25 లక్షలు మాత్రమే చెల్లించింది.
పాలసీదారుకు పోలియో ఉందన్న కారణంతో మరణానంతర ప్రయోజనాలను చెల్లించడానికి నిరాకరించింది. దీంతో హుస్సేన్ భార్య మహమ్మద్ పర్వీన్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రాగా.. బీమా సంస్థ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యురాలు మీనారామనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ‘‘పాలసీదారుకు పోలియో ఉన్న మాట వాస్తవమే. అయితే దాని కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందారనడానికి ఎలాంటి ఆధారాలను బీమా సంస్థ చూపలేదు. బీమా క్లెయింను పాక్షికంగా చెల్లించి మిగిలినది నిరాకరించడం సరికాదు. పాలసీలో పేర్కొన్న విధంగా మరణానంతరం రూ.8.80 లక్షలు చెల్లించాల్సిందే. ఇప్పటికే చెల్లించిన కనీస బీమా మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తానికి 2014 నుంచి 7 శాతం వడ్డీతో, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలి’’ అని తీర్పులో పేర్కొంది.