హైదరాబాద్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది చార్మినార్, ఇరానీ చాయ్, బిర్యాని. వీటితో పాటే.. మాదాపూర్ దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నగరానికి మరో మణిహారంలా మారనుంది. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జి.. నిర్మాణ ప్రధాన పనులు దాదాపు పూర్తై తుది మెరుగులు దిద్దుకుంటోంది.
సుమారు 30 టన్నుల బరువున్న 36 టిప్పర్లను ఇసుకతో నింపి వాటిని మూడు వరుసల్లో నిలిపి లోడ్ బేరింగ్ టెస్ట్ చేస్తున్నారు బల్దియా ఇంజినీరింగ్ అధికారులు. 24 గంటలుగా చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమవుతోందని అధికారులు భావిస్తున్నారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. స్టే-కేబుళ్లను ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లోని పర్యావరణాన్ని దెబ్బతినకుండా ఆ ఒడ్డు, ఈ ఒడ్డుపై కేవలం 2 ఫిల్లర్ల సహాయంతో 735 మీటర్ల పొడువులో ఎల్ అండ్ టీ సంస్థ తీగల వంతెనను నిర్మిస్తోంది. 8 దేశాల ఇంజినీర్లు నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య గణనీయంగా దూరం తగ్గడంతో పాటు రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటుగా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్గా రూపొందనుంది. రోడ్డు నెంబర్ 36, జూబ్లీహిల్స్, మాదాపూర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.