రోడ్డు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రైల్వే అండర్ బ్రిడ్జ్, సబ్‌వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణాలను దక్షిణ మధ్య రైల్వే వేగవంతం చేసింది. రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల స్థానాల్లో వీటి నిర్మాణ పనులు చేపట్టింది. హైదరాబాద్ డివిజన్లో మే-డిసెంబర్ మధ్య కాలంలో రూ.30.8 కోట్ల వ్యయంతో రికార్డ్ స్థాయిలో 11 నిర్మాణాలను పూర్తిచేసింది.
రైల్వే క్రాసింగ్ గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణం వేగవంతం - రైల్వే క్రాసింగ్ గేట్ల స్థానంలో బ్రిడ్జిల నిర్మాణం
రైల్వే క్రాసింగ్ గేట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా దక్షిమ మధ్య రైల్వే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రహదారి ప్రయాణికుల భద్రత కోసం వాటి స్థానాల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్, సబ్‌వేలు (ఎల్హెచ్ఎస్), రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టింది. హైదరాబాద్ డివిజన్లో రూ.30.8 కోట్ల వ్యయంతో రికార్డు స్థాయిలో 11 చోట్ల నిర్మాణాలు పూర్తి చేసింది.
రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు విధానంలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తూ దశల వారీగా బ్రిడ్జ్‌లు, సబ్‌వేల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటి నిర్మాణాల్లో సాంకేతిక పద్ధతులను అవలంభిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైల్వే ఇంజనీర్ల పద్దతిని అనుసరించి సబ్‌వేల నిర్మాణానికి అనువుగా ముందే తయారుచేసిన రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ (ఆర్సీసీ) బాక్సులను సంబంధిత ప్రాంతాలకు తరలించారు. ఈ విధంగా తక్కువ సమయంలోనే రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి పునరుద్ధరించినట్లు రైల్వే శాఖ తెలిపింది.