పెట్రో ధరల పెంపుపై రేపు చలో రాజ్‌భవన్ (Chalo Raj bhavan) కార్యక్రమం చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanth Reddy) ప్రకటించారు. ధర్నా చౌక్ నుంచి చలో రాజ్‌భవన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలి రేవంత్ తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్లు ముట్టడిస్తామని ఉద్ఘాటించారు. పోలీసులు అడ్డుకోవడం, కేసులు పెట్టడం నిత్యకృత్యమైందని ఆరోపించారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని ఎండగడతామన్నారు.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల ఈరోజు అత్యంత పేదవాడి నుంచి సంపన్నుల వరకు పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కరోనా సమయంలో ప్రజలు బతకడానికే కష్టమవుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మాత్రం మానేయలేదు. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 105 రూపాయలు ఉంటే... వాస్తవంగా పెట్రోల్ ధర రవాణా ఛార్జీలు, డీలర్ల కమీషన్లతో సహా అన్ని కలిపితే 40 రూపాయలు మాత్రమే. 40 రూపాయల ఇంధనాన్ని 65 రూపాయలు అదనంగా కలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నాయి. 32 రూపాయలు కేసీఆర్ దోచుకుంటే... 33 రూపాయలు నరేంద్ర మోదీ దోచుకుంటున్నారు. చారణా కోడికి బారణా మసాలా. అసలు కంటే మిత్తి ఎక్కువున్నది. ప్రజలను ఇలా పట్టిపీడిస్తుంటే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రభుత్వాల మెడలు వంచాలంటే పేద ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో సైకిల్ యాత్రలు, ఎడ్ల బండి యాత్రలు చేసినం. రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నం. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు నిరసన తెలపడానికి కార్యక్రమం తీసుకున్నమో... పేదలు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకతీతంగా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ల దోపిడీని ప్రశ్నించినపుడల్లా... మా మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, మా కార్యకర్తలను నిర్భందించడం ఇలాంటి కార్యక్రమాలు ఎపుడు చేస్తనే ఉంటరు. ఇదే విధంగా ప్రభుత్వాలు బరితెగించి చేస్తే ఈసారి చలో రాజ్‌భవన్ కాదు పోలీస్స్టేషన్ల ముట్టడే పెడ్తం. ఎంతమందిని కార్యకర్తలను, ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసి ఏ జైళ్ల పెడ్తరో నేనూ చూస్త. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఊరుకునే సమస్యనే లేదు.
-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి:మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు