ఉన్న నీళ్లు మాకు సరిపోతాయి.. వేరే బేసిన్‌కు మళ్లించడానికి వీలు లేదు అంటూ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అధిగమించడానికి కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇటీవల జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా బేసిన్‌లోని భాగస్వామ్య రాష్ట్రాలకు ట్రైబ్యునళ్లు నీటిని కేటాయించడంతోపాటు ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు మళ్లించడానికి కూడా కేటాయింపు చేయాలనే కొత్త ప్రతిపాదన వచ్చింది. మహానది నుంచి గోదావరికి నీటి మళ్లింపుపై ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో మహానది ట్రైబ్యునల్‌లోనే జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) భాగస్వామి అయ్యే అంశంపై న్యాయసలహా తీసుకోవాలని నిర్ణయించింది.
మహానది జలాలే కీలకం
నదుల అనుసంధానంలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి గోదావరిపై ధవళేశ్వరానికి, ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించాలన్నది ప్రతిపాదన. మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానానికి ఒడిశాలోని మహానది నుంచి మిగులు నీటిని గోదావరికి మళ్లించడం కీలకం. అయితే మహానదిలో మిగులు జలాలు లేవని, మళ్లించడానికి వీలులేదనడంతో పాటు నీటి మళ్లింపు మార్గంపైనా ఒడిశా అడ్డు చెప్పడంతో పలు ప్రత్యామ్నాయాలపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేస్తోంది.
ఇదే సమయంలో గోదావరి నుంచి నీటి మళ్లింపు జాప్యం కాకుండా ఉండటానికి, కేటాయింపు ఉండీ ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని నీటిని, గోదావరిలో ఉన్న మిగులు జలాలను కలిపి కృష్ణా-పెన్నా మీదుగా కావేరి వరకు 247 టీఎంసీలు మళ్లించే ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చింది. అయితే తమ రాష్ట్రంలో మిగులు జలాలు లేవని, నీటి లభ్యతపై మొదట అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరింది. దీంతో ఈ ప్రతిపాదన కూడా పక్కన పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఛైర్మన్ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో దీని గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర జలసంఘం, జల్‌శక్తి, ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులతో సహా పలువురు జలవనరుల నిపుణలు పాల్గొన్నారు.