Amendment Electricity Act: విద్యుత్ వినియోగానికి యూనిట్‌వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశముందా? కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్దిరోజుల్లోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఖర్చులను బట్టి ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను పూర్తిగా ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లకే కట్టబెడుతూ కేంద్ర విద్యుత్ చట్ట నియమావళికి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
కరెంటు కొనుగోలు, ఇతర ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త విధానంతో నెలనెలా ఛార్జీలు పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త నియమావళి ముసాయిదా (డ్రాఫ్ట్)ను శుక్రవారం అన్ని రాష్ట్రాల విద్యుత్‌శాఖలు, విద్యుత్ సంస్థలకు కేంద్రం పంపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే సెప్టెంబరు 11లోగా మెయిల్ ద్వారా తెలపాలని సూచించింది.
విద్యుత్ చట్టాన్ని సవరించేందుకు బిల్లు తయారుచేసి పార్లమెంటులో ప్రవేశపెట్టగా దాన్ని ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో సభాపతి సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఇక ఇప్పట్లో బయటికి వస్తుందో రాదోనన్న అనుమానంతో విద్యుత్ చట్టం-2003లోని నియమావళికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ దొడ్డిదారిన తాజా ముసాయిదాను పంపింది. అభ్యంతరాలకు సెప్టెంబరు 11 దాకా గడువు ఇచ్చినందున అక్టోబరులో తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశాలున్నాయని అంచనా.
ముసాయిదాలో ఏముందంటే...
*ఇంతకాలం కరెంటు ఛార్జీలను పెంచాలంటే ఏడాదికోమారు డిస్కంలు ఆదాయ, వ్యయాల నివేదికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కివ్వాలి. వాటిని పరిశీలించి ఏడాదికోమారు ఛార్జీల సవరణకు మండలి ఆదేశాలిస్తోంది. కానీ ఇకనుంచి ఖర్చులను ఎప్పటికప్పుడు లెక్క చూసుకుని ఆ మేరకు కరెంటు ఛార్జీలను ప్రజల నుంచి డిస్కంలు వసూలు చేసుకోవచ్చని ముసాయిదాలో ప్రతిపాదించారు.
*విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి, బహిరంగ మార్కెట్‌లో ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి కరెంటును డిస్కంలు కొంటాయి. యూనిట్‌కు గరిష్ఠంగా రూ.12 వరకూ చెల్లించి కరెంటును రోజూ కొనాల్సి వస్తున్నందున నష్టాలు వస్తున్నాయని డిస్కంలు చెబుతున్నాయి. ఏటా ఒకసారి ఈఆర్‌సీ ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడటం వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమలైతే నెలనెలా ఛార్జీలు పెరుగుతాయనే తెలుస్తోంది. ఇలా వసూలుచేసిన ఛార్జీల లెక్కలను ఏడాదికోసారి ఈఆర్‌సీకి నివేదించి హెచ్చుతగ్గులుంటే మరుసటి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఛార్జీలను సవరించేందుకు ఈఆర్‌సీ తుది ఆదేశాలిస్తుంది.
సంప్రదాయేతర ఇంధనానికిక ఏకీకృత ధరలు:కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్‌కేంద్రాల నుంచి వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేసే ‘సంప్రదాయేతర ఇంధనానికి’ (రెన్యూవబుల్ ఎనర్జీ-ఆర్‌ఈ) ఏకీకృత ఇంధన విక్రయ ధరలను నెలవారీగా నిర్ణయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నియమావళికి సవరణ ముసాయిదాలో మరో ప్రతిపాదన చేసింది. జల, సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటే ఏకీకృత సగటు విక్రయధరను నిర్ణయించాలని తెలిపింది. దీనిని ఆధారం చేసుకుని ఆర్‌ఈ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటు కొనుగోలు ధరలను నిర్ణయిస్తారు.
*సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేసిన తరవాత నిల్వ చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పిస్తూ మరో ప్రతిపాదన చేసింది. డిస్కం గానీ, జెన్‌కో లేదా ట్రాన్స్‌కో లేదా ఏ ఇతర కంపెనీ అయినా ఆర్‌ఈని నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చు. ఈ ప్రతిపాదన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉంది. బిల్లు పార్లమెంటులో ఆగిపోవడంతో ఇలా నియమావళి సవరణ ప్రతిపాదనల్లో పెట్టి అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాష్ట్ర సీనియర్ విద్యుత్ అధికారి ఒకరు చెప్పారు.
ఇవీ చదవండి:రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రముఖుల ఇళ్లలో వెల్లివిరిసిన అనుబంధాల వేడుక చిత్రమాలిక