బడ్జెట్లో వ్యవసాయ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపుగానే వ్యవహరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరమన్నారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న మంత్రి.. కేంద్రం వాటిని పట్టించుకోకపోవడం వ్యవసాయాన్ని విస్మరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే కోరుతున్నా.. కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధి హామీని అనుసంధానం చేస్తామనడం సరికాదని వాపోయారు.