'ఒకే దేశం, ఒకే పన్ను' నినాదంతో వచ్చిన వస్తు సేవల పన్ను అమలులో ఎదురవుతున్న చిక్కులను అధిగమించేందుకు జీఎస్టీ మండలి కృషి చేస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఆయారాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే వినతులను నిశితంగా పరిశీలిస్తుంది. రాష్ట్రాలకు, కేంద్రానికి ఆమోదయోగ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది.
లొసుగులే ఆసరా...
జీఎస్టీ అమలు వ్యవహారమంతా ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో... కొందరు అక్రమార్కులు దానిలోని చిన్నపాటి లొసుగులను ఆసరా చేసుకుని పన్నులు ఎగ్గొడుతున్నారు. బోగస్ సంస్థలను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నిర్వహించకుండానే నకిలీ ఇన్ వాయిస్‌లను జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి... ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్న కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమార్కులపై నిఘా ఉంచి వారి పని పడుతున్నాయి.
జీఎస్టీ రాబడులపై ప్రభావం...
అక్రమార్కుల భరతం పడుతున్నా.. అసలు రిటర్నులు ఫైల్ చేయని వారిపై మాత్రం ఇంకా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 2017 జులైలో వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు వేయలేదు. గడువులు ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వచ్చినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా కోటి 20 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలవారీగా కాని, మూడు నెలలకు ఒకసారికాని తమ వ్యాపారాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కానీ చేయట్లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 81.41లక్షలు, మేలో 80.14లక్షలు, జూన్‌లో 75.79లక్షలు, జులైలో 75.80లక్షలు, ఆగస్టులో 75.94లక్షలు, సెప్టెంబరులో 73.83 లక్షలు లెక్కన రిటర్న్‌లు వచ్చాయి. ఈ ఆరు నెలల సగటు తీసుకుంటే నెలకు 77లక్షలే రిటర్న్‌లు వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావల్సిన పన్నులు కూడా వసూలు కావడం లేదు. ఈ ప్రభావం జీఎస్టీ రాబడులపై పడుతోంది.
జీఎస్టీ నమోదు రద్దు...
జీఎస్టీ దాఖలు చేయని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అంచనాల కంటే తక్కువగా వసూళ్లు నమోదవుతుండటంతో సీబీఐసీ, జోనల్ కార్యాలయాలకు రిటర్నులు దాఖలు చేయనివారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆరు లేదా అంతకంటే ఎక్కువ గడువులకు సంబంధించిన జీఎస్టీఆర్-3బి రిటర్నులు దాఖలు చేయనివారికి జీఎస్టీ నమోదు రద్దు చేయడంతో పాటు సెక్షన్ 29, సీజీఎస్‌టీ చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు.
అలా చేస్తే వారికే లాభమా?
ఎలాంటి చర్యలు లేకుండా రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం ద్వారా... ఆయా సంస్థలు ఆరు నెలల పాటు వ్యాపారం చేసుకున్నా... రిటర్న్‌లు దాఖలు చేయరు. అంతే కాకుండా... కొత్త పేర్లతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటర్న్‌లు వేయని సంస్థలపై నిఘా ఉంచి... చట్టపరమైన చర్యలు తీసుకునేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
సెక్షన్ 29పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తర్జనభర్జన
జీఎస్టీ రిటర్న్‌లు సక్రమంగా అమలు చేయని వ్యాపార, వాణిజ్య సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. జీఎస్టీ చట్టం సెక్షన్ 29ని ఉపయోగించి రద్దు చేయాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తుండగా... కేంద్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు ముందుకేస్తోంది. అక్రమాలకు పాల్పడే వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఇది ఊతమిచ్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో... రిటర్న్‌లు దాఖలు చేయని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది.
సెక్షన్ 29పై తర్జనభర్జన పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు