అఖిల భారత కోటాలో 6,410 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి 5,040 సీట్లు, దేశవ్యాప్తంగా 82,926 సీట్లున్నాయని తెలిపింది. ఇందులో 278 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 42,729 సీట్లు.. 263 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 38,840 సీట్లున్నాయి. ఈ నెల 13న నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లోపు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ 2020-21 సంవత్సరానికి వైద్య కళాశాలలు, సీట్ల వివరాలతో సమగ్ర సమాచారాన్ని తాజాగా విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం రెండేళ్ల క్రితం అఖిల భారత కోటాలో చేరడంతో రాష్ట్రంలో విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రవేశ అవకాశాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం నుంచి సుమారు 261 ఎంబీబీఎస్ సీట్లను అఖిల భారత కోటాలోకి ఇవ్వడం ద్వారా రాష్ట్ర విద్యార్థులు జాతీయస్థాయిలో 6,410 సీట్లకు పోటీ పడడానికి అర్హత లభించింది. ఈ ఏడాది నుంచి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ కళాశాలలు; ఎయిమ్స్ కళాశాలలు; జిప్‌మర్ వంటి స్వయం ప్రతిపత్తి వైద్యసంస్థల్లోనూ నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే వైద్యవిద్య ప్రవేశాలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా వైద్య సంస్థల్లో ప్రవేశాలకు మరో ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.