కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు పూర్తై సాగునీరు అందుబాటులోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలమే... సాగునీటి రంగం మరింత పరిపుష్ఠం కానుంది. ప్రభుత్వ ప్రాధమ్యాలలోనూ అగ్రతాంబూలం నీటిపారుదల శాఖదే. ఇందులో భాగంగా శాఖను పునర్‌వ్యవస్థీకరణ చేపట్టి బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం జలసౌధలో సమావేశమై పలు సిఫార్సులను సిద్ధం చేసింది. అవి..
ఈఎన్‌సీల నుంచే ప్రతిపాదనలు
నీటిపారుదల వ్యవస్థ అంతా ఈఎన్‌సీ కేంద్రంగా సాగాలి. జిల్లా పరిధి లేదా కొన్ని ప్రాజెక్టుల సమూహంగా ఈఎన్‌సీ పరిధిలో ఉండాలనేది కీలక అభిప్రాయంగా ఉంది. ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ముగ్గురు ఎస్‌ఈలను అందుబాటులో ఉంచాలి. భారీ, మధ్య, చిన్నతరహా శాఖలకు ఇక స్వస్తి. మండల స్థాయి నుంచి ఈఎన్‌సీ వరకు ఒకటే వ్యవస్థగా ఏర్పాటు చేస్తే పర్యవేక్షణ సులువు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, ఎత్తిపోతలు కలిపి సరిపోను ఈఎన్‌సీలను నియమించి వారి ద్వారానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందేలా చూడాలి.
పరిపాలన పరంగా ఒక ఈఎన్‌సీని ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ఇతర కమిటీలన్నీ యథాతథంగా ఉంచాలి. ఈఎన్‌సీలను దాటి చర్చించాల్సి వస్తే వీటిలో నిర్ణయాలు తీసుకోవచ్చు. తెలంగాణ నీటి పారుదల శాఖ(ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్) పేరును జలవనరుల శాఖగా (వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్) మార్పు చేయాలి. ఇప్పటికే కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో జలవనరుల శాఖగానే చలామణిలో ఉంది. పాలనాపరమైన అనుకూలతలకు ఇది ప్రయోజనం చేయనుంది.
శాశ్వత పద్ధతిలో కొత్త ఇంజినీర్ల నియామకం
నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం కొత్త సిబ్బంది అవసరం ఏర్పడనుంది. ఎత్తిపోతల నిర్వహణ, ప్రాజెక్టులు, హెడ్‌రెగ్యులేటర్ల నిర్వహణకు ఇంజినీర్ల సంఖ్య పెంచాల్సి ఉంది. దీంతోపాటు కొంతమంది వర్క్‌ఇన్‌స్పెక్టర్ల నియామకం తప్పనిసరి. ఒప్పంద పద్ధతిలో కాకుండా శాశ్వత నియామకాలు చేపడితేనే బాధ్యతతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే ఇప్పుడున్న ప్రాజెక్టులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది వరకు వర్క్ఇన్స్పెక్టర్లు అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం రెండు వేల లోపే అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం శాఖలో కిందిస్థాయి నుంచి ఈఎన్‌సీ వరకు ఆరు వేల మంది ఉండగా ఈ సంఖ్య ఎనిమిది నుంచి పదివేలకు చేరే అవకాశాలు ఉన్నాయి.
నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు
ప్రాజెక్టుల నిర్మాణం అనంతరం వాటి నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. దీన్ని పూర్తిగా పరిష్కరించేందుకు ఇకపై ప్రాజెక్టుల నిర్వహణను గుత్తేదారులకు అప్పగించాలి. నిర్మాణ ఒప్పందంలో భాగంగా నిర్వహణ బాధ్యతలు తీరాక ఆ గుత్తేదారు సంస్థకే తిరిగి అప్పగిస్తే మేలు. దీనికోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.