హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అస్పైర్-బయోనెస్ట్ సహకారంతో నడుస్తున్న అంకుర సంస్థ ఆంకోసీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ గ్రాంటుకు ఎంపికైంది. కరోనా పోరులో భాగంగా కొవిడ్-19 పరిశోధన కన్సార్షియం పేరిట వివిధ అంకుర సంస్థలను ఒకేచోటకు చేర్చి పరిశోధనలు చేపట్టేందుకు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం నిర్ణయించింది. ఆ శాఖ ఆధ్వర్యంలో నడిచే బయోటెక్నాలజీ పరిశ్రమ పరిశోధన సహాయత మండలి (బైరాక్) తరఫున ఆంకోసీక్ బయో కంపెనీకి ఈ గ్రాంటు లభించనుంది.
హెచ్‌సీయూలోని అంకుర సంస్థకు కేంద్రం నిధులు - ఆంకోసీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్
కరోనాపై పోరులో పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు కొవిడ్-19 పరిశోధన కన్సార్షియం పేరిట కేంద్రం నిధులు సమకూరుస్తోంది. ఆంకోసీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే అంకుర సంస్థ కేంద్ర ప్రభుత్వ గ్రాంటుకు ఎంపికైంది.
పరిశోధనశాలలో కల్చర్ (ద్రావణం)ను వినియోగించి ఇన్‌విట్రో ఊపిరితిత్తుల ఆర్గనాయిడ్ నమూనాను సంస్థ తయారు చేయనుంది. గ్రాంటు కోసం దేశవ్యాప్తంగా 500 ప్రతిపాదనలు అందగా.. 16 సంస్థలను కేంద్రం ఎంపిక చేసింది. వాటిల్లో ఆంకోసీక్ బయో కంపెనీ ఉండటం విశేషం. దీన్ని నగరానికి చెందిన డాక్టర్ పూసల సురేష్ ప్రారంభించగా వడ్లూరి భరద్వాజ్, షణ్ముగప్రియ సభ్యులుగా ఉన్నారు. రానున్న 6 నెలల్లో వైరస్ నియంత్రణకు వినియోగించే మందులు, ఇతరత్రా మూలకాలను వారు తయారు చేసిన నమూనాలతో పరీక్షిస్తారు. వీరికి హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సెస్ ఆచార్యులు ప్రోత్సాహం అందిస్తారు.