తెలంగాణ

telangana

ETV Bharat / state

Nano Urea : నానో యూరియా.. పంటలకు మేలయా - liquid urea usage

Nano Urea : నానో యూరియా వినియోగంపై రైతులకు అన్ని రాష్ట్రాలు అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. దీన్ని వాడటం వల్ల పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో నానో యూరియా ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

Nano Urea
నానో యూరియా

By

Published : Jul 6, 2022, 10:58 AM IST

Nano Urea: ద్రవరూపంలో ఉండే నానో యూరియా వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సాధారణ గుళికల యూరియాకు బదులు దీనిని వాడటం వల్ల రైతులకు ఎకరానికి రూ.4 వేల దాకా ఆదా అవడమే కాకుండా ఇంకా ఎన్నో సత్ఫలితాలు వస్తాయని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నానో యూరియా ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీని వినియోగం గణనీయంగా పెంచేందుకు రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు తాజాగా సూచించింది. గత ఆగస్టు నుంచి దేశంలో నానో యూరియా వాణిజ్య వినియోగం ప్రారంభమైంది.

ఏటా 44 కోట్ల సీసాల ఉత్పత్తి లక్ష్యం :డ్రోన్ల ద్వారా నానో యూరియా చల్లేందుకు ఇప్పటికే 228 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ఎరువుల శాఖ వెల్లడించింది. డ్రోన్లను నడపటం వల్ల వారికి నెలకు రూ.46 వేల దాకా ఆదాయం వస్తుందని ప్రకటించింది. 2021 ఆగస్టు నుంచి గత నెలాఖరు వరకు 3.90 కోట్ల నానో యూరియా సీసాలను ఇఫ్కో సంస్థ గ్రామాలకు పంపగా రైతులు 2.87 కోట్ల సీసాలను కొని పంటలపై చల్లినట్లు తాజాగా వెల్లడైంది.

ఇది 13 లక్షల టన్నుల సాధారణ గుళికల యూరియాతో సమానమని తేలింది. రైతులకే కాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ యూరియాపై ఇస్తున్న రాయితీ నిధులు ఏటా రూ.40 వేల కోట్ల వరకూ ఆదా అవుతాయని తేల్చారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8 ప్లాంట్లలో ఏటా 44 కోట్ల నానో యూరియా సీసాలు ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని ప్రకటించింది. నానో యూరియాపై పేటెంట్‌ కలిగిన ఇఫ్కో కంపెనీతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌’ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ఫెర్టిలైజర్స్‌ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తగ్గనున్న కాలుష్యం..పంట పొలాల్లో అధికంగా చల్లుతున్న సాధారణ యూరియా వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. నేలసారం దెబ్బతింటోంది. దీన్ని అధిగమించడానికి నానో యూరియా ఉపయోగపడుతుందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌)కు చెందిన పరిశోధన సంస్థలు వెల్లడించాయి. నానో యూరియా వాడితే పంటల ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు కూడా పెరుగుతాయి.

సాధారణ యూరియా బస్తాల రవాణాకు ఏటా రైళ్లు, లారీలకు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారు. సీసాల రవాణాతో ఆ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా 94 రకాల పంటలపై 11 వేల మంది రైతుల పొలాల్లో 43 ప్రాంతాల్లో ఐసీఏఆర్‌ నిర్వహించిన ప్రయోగాల్లో నానో యూరియా వాడకం వల్ల 8 శాతం వరకూ పంట ఉత్పాదకత పెరిగినట్లు తేలింది. నానో యూరియాను అరలీటరు చొప్పున సీసాలో రైతులకు విక్రయిస్తున్నారు. ఇది సాధారణ గుళికల యూరియా 45 కిలోలకు సమానమైన పోషకశక్తిని కలిగి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details