- పంజాగుట్టలోని ఒక పేరున్న హోటల్. కొవిడ్ వల్ల ఏడాదిలో ఎక్కువ రోజులు లాక్‌డౌన్‌లోనే గడిచిపోయాయి. వ్యాపారం పెద్దగా సాగడం లేదు. కరెంట్ బిల్లులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. బకాయిలు రూ.4.5 లక్షలకు చేరడంతో విద్యుత్తు అధికారులు కరెంట్ కనెక్షన్ తొలగించారు. ఇంత మొత్తం ఒకేసారి చెల్లించలేం.. వాయిదాల్లో కట్టేస్తాం.. కనెక్షన్‌ను పునరుద్ధరించండి అని విద్యుత్తు అధికారులను కోరుతున్నారు.
- తాండూరులోని ఒక స్టోన్ పరిశ్రమ ఏడాదికాలంగా వ్యాపారం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ఏడాది కొవిడ్ లాక్‌డౌన్.. ఆ తర్వాత భారీ వర్షాలు.. ఈ సారి మళ్లీ కొవిడ్ ప్రభావంతో కార్యకలాపాలే సాగలేదు. అయినా కరెంట్ కనీస ఛార్జీలతో బిల్లులు పెరిగిపోయాయి. బకాయిలు రూ.2.5 లక్షలు ఉండటంతో కనెక్షన్ తొలగించారు. వాయిదాల్లో బిల్లులు చెల్లిస్తాం.. కనెక్షన్ ఇవ్వండని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
నగరంలో ఇలాంటి సంస్థలు వేలల్లోనే ఉన్నాయి. వ్యాపారం బ్రహ్మాండంగా సాగినప్పుడు నెలకు రూ.2 లక్షలకు పైగా కరెంట్ బిల్లులను ఠంచనుగా కట్టిన చరిత్ర వీరిది. కొవిడ్‌తో పరిస్థితులు తలకిందులు కావడంతో కనీస బిల్లులు చెల్లించలేక చాలా సంస్థలు రూ.లక్షల్లోనే బకాయి పడ్డాయి. నిబంధనల మేరకు అధికారులు వాటికి సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గడం.. వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో ఆయా కంపెనీలు, వాణిజ్య సంస్థలు తిరిగి తమ వ్యాపారాన్ని పునఃప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత సొమ్ము కట్టించుకుని కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలని.. మిగతా మొత్తాన్ని రెండు మూడు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వ్యాపార వర్గాలు విద్యుత్తు అధికారుల కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ఒకేసారి బకాయిలు మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేమని అధికారులను వేడుకుంటున్నారు. కొవిడ్‌కు ముందు తమ కరెంట్ బిల్లుల చెల్లింపుల చరిత్రను గమనించి.. మానవత్వంతో పరిశీలించి వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.