ఏటా ఇదే తంతు. ఆరుగాలం శ్రమించి అన్నదాతలపై భారాలు తప్పడం లేదు. తాజాగా బీటీ పత్తి విత్తన ధరలు పెంచాలంటూ ప్రైవేటు కంపెనీలు తెచ్చిన ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది. దేశ వ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పత్తి పంటకు సంబంధించి విత్తనాల ధరలు పెంచింది. ఈ పెంపు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులపై ఏకంగా 66 కోట్ల రూపాయలకు పైగా భారం పడనుంది. 450 గ్రాముల ప్యాకెట్ ధర ఇంత కాలం 730 రూపాయలు ఉండేది. ఇక నుంచి ప్యాకెట్ ధర 767 రూపాయల చొప్పన రైతులకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటీ పత్తిలో 2 రకాల విత్తనాలు ఉంటాయి. బీటీ లేదా బీజీ-1 ప్యాకెట్ ధర ప్రస్తుతం 635 రూపాయలుగా ఉంది. ఆ రకం రైతులెవరూ కొనడం లేదు. అందువల్ల ఆ రకం ధర పెంచలేదు.
రైతు సంఘాల ఆందోళన
రైతులు ఎక్కువగా వాడుతున్న బీజీ-2 రకం ధర 767 రూపాయలకు పెంచింది. ఈ ఏడాది రాబోయే ఖరీఫ్ సీజన్‌లో అంచనాలకు మించి పత్తి సాగు చేయించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో రైతులు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఒక్క తెలంగాణలో గత వానా కాలంలో 60 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. అంత భారీ ఎత్తున సాగుకు యోగ్యం కాదని రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో వెల్లడైంది.
చర్యలు తీసుకోవాలి
వాతావరణం, భూమి, నీరు స్వభావం బట్టి చూస్తే 30 నుంచి 40 లక్షల ఎకరాలకు మాత్రమే సాగుకు అనుకూలమని తేల్చింది. మిగిలిన పంటల సాగుకు అనుకూలతలు, కొనుగోళ్లు, ధరలు లేకపోవడం, ఆహార పంటలకు ఒక రకమైన భద్రత లేకపోవడం వెరసి.. అధిక శాతం రైతులు పత్తి వైపు మళ్లుతున్నారన్న వాస్తవం. పత్తి సహా వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్ లాంటి పంటల విత్తనాలు మార్కెట్‌లో కొన్నప్పుడు నాసిరకం రాకుండా చూడటం.. ఒకవేళ నష్టపోతే కంపెనీలను జవాబుదారీగా చేసిన నష్ట పరిహారం రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
అదనపు భారమే
సాధారణంగా రైతులు ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనాలు వాడుతుంటారు. ఈ ఏడాది రాబోయే వానాకాలంకు సంబంధించి తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం 75 లక్షల ఎకరాలు పైగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో విత్తన కంపెనీలు రైతులపై అనేక రకాల భారాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలపై ఒత్తిళ్ల ఫలితంగా 450 గ్రాములు గల ప్యాకెట్ ధర 37 రూపాయల దాకా పెంచేసింది. చూడ్డానికి అది అదనపు భారమే.. ఈ మేరకు తాజాగా ప్రత్తి సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. దీన్నిబట్టి రైతులు దాదాపు కోటిన్నర పైగా విత్తన ప్యాకెట్లు కొనాల్సి ఉంటుంది.
ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో 15 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తే మరో 30 లక్షల ప్యాకెట్లు కొంటారు. మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో కోటి 80 లక్షల ప్యాకెట్లు కొంటే రైతులను అదనంగా 66.60 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. ధరలు పెరుగుతుండటంతో నాసిరకం విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇది మరో సమస్యగా మారుతోంది. జీవ వైవిధ్యం, పర్యావరణ హితం దృష్ట్యా పత్తి సాగుకు నిరుత్సాహపరచకపోతే గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ప్రభుత్వం పెంచిన పత్తి విత్తన ప్యాకెట్ ధరలు తక్షణం ఉపసంహరించుకోవడమే కాకుండా విత్తన చట్టం అమల్లోకి తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
రైతులకు సిఫారసు
బీటీ పత్తి సాగు చేస్తే ఇటీవల గులాబీ రంగు పురుగు అధికంగా వ్యాపించి పంటను నాశనం చేస్తోంది. దాంతోపాటు ఇతర తెగుళ్ల నివారణకు పత్తి వేసిన క్షేత్రం చుట్టూ ఒక వరస సాధారణ సంకర జాతి పత్తి వండగాలు లేదా కంది పంట వేయాలని కేంద్రం రైతులకు సిఫారసు చేసింది. అందుకోసం పత్తి విత్తన ప్యాకెట్‌లో అదనంగా 25 గ్రాముల సాధారణ సంకర జాతి పత్తి విత్తనాలు ఉంచి అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా అమ్మకపోతే విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖలకు సూచించింది.
ఇదీ చూడండి :'ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి'