Bandi Sanjay Comments on CM KCR: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. బండి సంజయ్ బంజారాహిల్స్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గొప్పదనాన్ని ప్రజలందరికీ వివరించారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ వందసార్లు రేడియో ద్వారా మనందరితో మాట్లాడిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు. ఇంత వరకు ఏ ప్రధాని.. మోదీ తరహాలో చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒక సమస్యపై ప్రజలతో చర్చించారని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న సమస్యలపై ప్రధాని మాట్లాడారని చెప్పారు.
ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది: మోదీ దేశంలో ఇన్ని గొప్ప పనులు చేస్తున్నా.. కొంత మంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం విమర్శిస్తున్నారని బండి మండిపడ్డారు. ప్రధాని మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయం కోసం కాకుండా ప్రజల కోసం వినియోగించారని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు తీసుకురాలేదని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలను జాగృతం చేసి.. చైతన్యవంతులను చేశారని హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇచ్చింది:మన్ కీ బాత్‌లోని కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్‌లను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందులో పరీక్ష పే చర్చ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించారని అన్నారు. హరి ప్రసాద్, చింతల వెంకట్ రెడ్డి, అహ్మద్ పాషానీ ఈ ప్రోగ్రామ్ ద్వారానే దేశానికి పరిచయం అయ్యారని తెలిపారు. సమస్యలను దేశ ప్రజలకు చూపించి వాటిని ఎలా ఎదుర్కోవాలో.. పరిష్కార మార్గాలు ఏంటి అని స్పష్టంగా చూపించారని చెప్పారు.