Fake Birth and Death Certificates Case in GHMC: జీహెచ్‌ఎంసీలో బోగస్ జనన, మరణ దృవీకరణ పత్రాల జారీ కేసులో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే పలువురు బీజేపీ కార్పొరేటర్లు అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని.. నగర పాలక సంస్థ ప్రధాన కార్యలయంలో ఆందోళన బాట పట్టారు. విమర్శలు రావడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
Fake Birth And Death Certificates Case Update News: సమీక్ష సమావేశంలో మేయర్ జరిగిన అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ జనన, మరణ దృవీకరణ సర్టిఫికెట్లను జారీ చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని మేయర్ విజయలక్ష్మి.. నగర పాలక సంస్థ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు సూచించారు. విచారణలో 21 వేల బోగస్ సర్టిఫికెట్లకు సంబంధించి జారీలో అవకతవకలు జరిగాయని బల్ధియా అధికారులు తేల్చారు. అయితే ఆర్టీవో ప్రొసీడింగ్ లేకుండా ఈ సర్టిఫికెట్లు మంజూరయినట్టు అధికారులు చెబుతున్నారు.
14 మీసేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ అయినట్ట గుర్తింపు: ఇవి తీసుకున్న వారికి నోటీసులు ఇస్తామంటున్నారు. వారంతా తిరిగి అన్నీ దృవీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అయితే వీటిని రద్దు చేసినట్టే అంటున్నారు. 14 మీసేవా కేంద్రాల్లో ఈ విధమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ అయినట్టు గుర్తించిన అధికారులు.. దీనిపై మీసేవా సంచాలకుడికి లేఖ రాయనున్నారు.