హైదరాబాద్‌లోని ఆల్ఫా యానిమల్ ఫౌండేషన్ (Alpha Animal Foundation) వీధి కుక్కల సంరక్షణ కోసం కృషిచేస్తోంది. ఈ సంస్థకు చెందిన 300 మంది వాలంటీర్లు శునకాల బాగోగులు చూసుకుంటారు. 8 ఏళ్లుగా వీధి కుక్కల దత్తత కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC)తో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల అనాథలుగా మారిన వీధికుక్కలను... ఈ స్వచ్ఛంద సంస్థ (Alpha Animal Foundation) చేరదీస్తుంది. వాటికి టీకాలు వేసి ఆసక్తి ఉన్న వారికి దత్తతనిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 3వేల శునకాలను దత్తతకు ఇచ్చినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ జాతుల కంటే దేశీయ కుక్కల పెంపకమే మేలంటున్న ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మి... అందరూ ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.
బాగోగుల పర్యవేక్షణ...
మహానగరంలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్న జీహెచ్ఎంసీ (GHMC) ఆల్ఫా యానిమల్ ఫౌండేషన్ వంటి సంస్థలకు అండగా నిలుస్తోంది. వీధి కుక్కలను దత్తతకు ఇవ్వడమే గాక... యజమానుల పూర్తి వివరాలు తీసుకుని వాటి బాగోగులను పర్యవేక్షిస్తోంది. గల్లీల్లో తిరిగే శునకాలను దత్తత ఇవ్వడం ద్వారా వాటి సంఖ్యను నియంత్రించడమే గాక ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించగలుగుతామని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు చెబుతున్నారు.