కేంద్రం 2011 నాటి వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలనడం సరికాదని, ఈ విధానాన్ని మార్చాలని రాష్ట్రం కోరుతోంది. తాము ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి అర్హులా? కాదా? చూడాలని కేంద్రానికి రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదుల ఇళ్లను పూర్తి సబ్సిడీతో నిర్మిస్తోంది.
మరోవైపు కేంద్రప్రభుత్వం పట్టణ ప్రాంత, గ్రామీణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ్ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్ర సర్కార్ కేంద్ర పథకాల్ని కలిపి రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల లక్ష్యంలో భాగంగా 2016-17లో తెలంగాణకు పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద 50,959 ఇళ్లు మంజూరు చేసింది.
20-30 శాతం మందే సరిపోలారు
సాంఘిక, ఆర్థిక కులగణన-2011 (సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సస్-సెక్) ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14 వేల రెండు పడకగదుల ఇళ్లను పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, ఇతర పద్ధతుల్లో లబ్ధిదారులను గుర్తిస్తోంది.