తమకు రావాల్సిన పీఎఫ్ డబ్బులు తక్షణం చెల్లించటం సహా పలు డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని కోరుతూ శనివారం ఖమ్మం డిపోనకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారు. శ్రీనివాస్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవటం వల్ల శరీరం 90శాతానికి పైగా కాలిపోయింది. కుమారుడి సహాయంతో మంటలు ఆర్పిన కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ సంతోష్ నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో శ్రీనివాస్‌కి వైద్యం అందించారు. అయితే ఈరోజు ఉదయం సుమారు 11గంటల సమయంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు.
రేపు డిపోల ఎదుట సంతాప సభలు
శ్రీనివాస్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో అపోలో ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు అత్యంత కట్టు దిట్టమైన భద్రత మధ్య మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. శ్రీనివాస్ మృతికి నివాళిగా... నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, రేపు ఉదయం సంతాప సభలు నిర్వహించాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులు ప్రాణత్యాగాలు చేయొద్దని ఆయన సూచించారు.
ప్రభుత్వ హత్యే
ప్రొఫెసర్ కోదండరాం, తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా పలువురు తొలుత అపోలో ఆస్పత్రికి చేరుకుని... శ్రీనివాస్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ మరణానంతరం ఆస్పత్రికి చేరుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెదేపా నేత రావుల చంద్రశేఖర్ వంటి వారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద భారీగా చేరి .. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని ఇతర ప్రదేశాలకు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు శ్రీనివాస్‌ది ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు.
శ్రీనివాస్ మృతితో అపోలో ఆస్పత్రి పరిసరాల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఇక ఈ రోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో క్యాండిల్ ర్యాలీని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం రేపు ఉదయం తిరిగి అన్ని డిపోల్లోనూ శ్రీనివాస్ మృతికి సంతాప సభలు నిర్వహించనున్నట్టు ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించారు. ఉద్యోగులు దైర్యంగా ఉండాలని కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని పిలుపునిచ్చారు.
'ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు... ప్రభుత్వ హత్యే'
ఇదీ చూడండి: ప్రధాని సోదరుడి కుమార్తె పర్స్ కొట్టేసిన దొంగలు అరెస్ట్