CONGRESS SENIORS MEET: కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా భేటీ కావాలని వీహెచ్, జగ్గారెడ్డి నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణించింది. పార్టీ సూచనలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించవద్దని హెచ్చరించింది. వీహెచ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలకు బోసురాజు ఫోన్ చేసి సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అయితే వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి లక్డీకాపూల్‌లోని అశోక హోటల్‌కు చేరుకున్నారు.
సమావేశంపై సందిగ్ధత
కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీనియర్ల సమావేశం అనుమానంగా మారింది. పార్టీకి వ్యతిరేకమనే భావన రాకూడదని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. ఈ సమావేశానికి రాలేమని ఇప్పటికే కొందరు సీనియర్లు వీహెచ్‌కు తెలిపారు. మరికొద్ది సేపట్లో వీహెచ్‌తో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడి హామీ ఇస్తేనే సమావేశాన్ని రద్దు చేసుకుంటామని వీహెచ్ స్పష్టం చేశారు. లేదంటే తమకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ఏఐసీసీ కార్యదర్శిని వీహెచ్ కోరారు. నాలుగు రోజులు కూడా గడవక ముందే మళ్లీ సీనియర్లు సమావేశం అంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అది మనకే నష్టమని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మేం చేస్తున్న దానిలో తప్పేం లేదు: జగ్గారెడ్డి
మా సమస్యలు అధిష్ఠానానికి తెలియజేయడమే లక్ష్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మేం చేస్తున్న దానిలో తప్పేం లేదన్నారు. పంజాబ్ తరహాలో పార్టీ నష్టపోవద్దనేది మా ఉద్దేశమని వెల్లడించారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే ఎలాంటి లాభం ఉండదని జగ్గారెడ్డి తెలిపారు.