sthree nidhi 10th Plenary Session: గ్రామీణ, పట్టణ పేద మహిళల్లో ఆర్థిక, జీవనోపాధిని కల్పించడంతో పాటు వారి ప్రమాణాలను పెంపొందించడానికి స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ కృషి చేస్తోంది. స్త్రీ నిధి 10వ సర్వసభ్య సమావేశం భాగ్యనగరంలో విజయవంతంగా ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2 వేల 710 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తక్కువ వడ్డీ, వడ్డీలేని రుణాలతో గ్రామ, పట్టణాల్లో పాల ఉత్పత్తి, గొర్రెలు, కూరగాయల పెంపకం వంటి సొంత వ్యాపారాలు ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క మహిళ దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తుంది.
ఆర్థిక సంవత్సరానికి ఎంత కేటాయించారు:2023-04 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికకు 2వేల 710 కోట్ల నిధులను ప్రతిపాదిస్తూ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు రూ.1261 కోట్లు, పట్టణ సమాఖ్యలకు రూ.549 కోట్ల చొప్పున నిధులు కేటాయింపునకు తీర్మానించారు. ఈ రుణ ప్రణాళికలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూ.874 కోట్లు కేటాయించారు. దశాబ్ధ ప్రస్తానంలో ఏటా వృద్ధి సాధిస్తూ స్త్రీనిధి ద్వారా లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండాయని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిర అన్నారు.
48 గంటల్లోనే రుణాలు అందిస్తోంది: 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రుణ వితరణ రూ.2,375 కోట్లలతో పోల్చినప్పుడు 2021-22లో 29 శాతం వృద్ధి నమోదైంది. 2022 మార్చి 31 నాటికి ఉన్న రుణనిల్వ 5వేల 355 కోట్లలతో పోల్చినప్పుడు ఆ సంవత్సరం సాధించిన వృద్ధి 28.20 శాతం నమోదయ్యింది. స్త్రీనిధి ప్రారంభించినప్పట్నుంచి గత ఏడాది మార్చి నాటికి 4.15 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 30 లక్షల మంది మహిళా సభ్యులు రుణాలు పొందారు. ఇప్పటి దాకా మొత్తం రుణ వితరణ రూ.15 వేల కోట్లలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. 1200 గ్రామాల్లో బ్యాకింగ్ సేవలందిస్తున్న స్త్రీనిధి.. 48 గంటల్లోనే రుణాలు అందిస్తుందని ఆ సంస్థ పాలకవర్గం తెలిపింది.