తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగల వేళ పారాహుషార్‌.. ఆదమరిచారో అంతే సంగతులు.. - Hawkeye app

Thar Gang in Hyderabad: పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోకి దోపిడీ ముఠాలు చొరబడుతున్నాయి. ఇప్పటికే చెడ్డీగ్యాంగ్​ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతుండగా.. ఇప్పుడు థార్​ గ్యాంగ్​ పేరుతో మధ్యప్రదేశ్​కు చెందిన ముఠా కదలికలు కనపడుతున్నాయి. వీళ్లకి తోడు స్థానిక ముఠాలు వేషం మార్చుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, పోలీసులు వీరిని గుర్తించడం కోసం ఎలా పనిచేస్తున్నారనేది ఇప్పుడు తెలుసుకొందాం.

Robbers in Hyderabad
Robbers in Hyderabad

By

Published : Sep 11, 2022, 7:21 AM IST

Thar Gang in Hyderabad: పండుగల సీజన్‌ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోకి.. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోకి దోపిడీ ముఠాలు చొరబడుతున్నాయి. ఇప్పటికే శివార్లలో కొన్ని రోజులుగా చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన థార్‌ గ్యాంగ్‌ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి తోడు స్థానిక ముఠాలు కూడా చెడ్డీ గ్యాంగ్‌ తరహాలోనే వేషం మార్చుకొని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌ నగర శివార్లలో విసిరేసినట్లు ఉండే ఇళ్లను దోపిడీ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, స్థిరాస్తి వ్యాపారం వృద్ధి చెందడంతో పెద్దఎత్తున నగదు లావాదేవీలు జరుగుతున్నాయి.

అందుకే దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థీకృత దోపిడీ ముఠాల గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారిందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అమీన్‌పూర్‌ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరిస్తోంది. మధ్యపదేశ్‌కు చెందిన థార్‌ గ్యాంగ్‌ నగర శివార్లలో ఏకంగా 98 దొంగతనాలకు పాల్పడింది. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని ఈ ఏడాది జూన్‌లో సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు నగరంలో నగదు చలామణి భారీగా జరుగుతుండటం వల్లే చోరీల కోసం ఇక్కడికి వస్తున్నామని వెల్లడించినట్లు సమాచారం. అలానే పోలీసుశాఖ రూపొందించిన హాక్‌ఐ యాప్‌ కూడా బాగా పనికొస్తుంది.

తీసుకోవల్సిన జాగ్రత్తలు:

* శివార్లలో ఉండేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలనీల్లో వాచ్‌మెన్‌ను పెట్టుకోవాలి. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. స్థానిక పోలీసులతో మాట్లాడి గస్తీకి వచ్చేలా చూసుకోవాలి. సీసీ కెమెరాలను ఎప్పుటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. పాడైన వాటిని వెంటనే మరమ్మతు చేయించుకోవాలి.

* దూరదూరంగా ఇళ్లు ఉండే పక్షంలో ఎత్తయిన ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే సోలార్‌ ఫెన్సింగ్‌ పెట్టుకోవాలి. శునకాలను పెంచుకోవాలి. ఇంటి చుట్టూ రాత్రి పూట కూడా వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* పక్కపక్కన ఉండేవారు పరస్పరం ఫోన్‌ నెంబర్లు పంచుకోవాలి. ఎవరి ఇంటి పరిసరాల్లో అయినా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఆ విషయం ఇంట్లో వారికి తెలియదు. పక్కింటి వారో, ఎదురింటి వారో దీన్ని గమనించే అవకాశం ఉంది. ఫోన్‌ నంబర్‌ ఉంటే వెంటనే సదరు ఇంటి యజమానికి అప్రమత్తం చేసే అవకాశం ఉంది.

* దోపిడీ దొంగలు సాధారణంగా బలవంతంగా ఇంట్లోకి జొరబడతారు. తలుపులు బద్దలు కొట్టుకొని, కిటికీ ఊచలు పీకేసి వస్తుంటారు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కిటికీ రెక్కలు బలంగా ఉండాలి. రాత్రిపూట కచ్చితంగా వాటిని మూసివేయాలి. వాటిని తెరవగలిగితే గ్రిల్స్‌కు ఉన్న స్క్రూలు సులభంగా తీసి లోనికి రావచ్చు. అలానే ఇంటికి వీలైనంత తక్కువ తలుపులు ఉండాలి. అవి బలంగా ఉండాలి. ముఖ్యంగా టవర్‌ బోల్టు మీద ఆధారపడితే కష్టం. గట్టిగా నెడితే ఇది ఊడిపోతుంది. తలుపులకు మధ్యలో పటిష్ఠమైన గడియ ఉండాలి.

* ఎవరైనా బలవంతగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా, కిటికీలు, తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించినా ఇంట్లో వారిని అప్రమత్తం చేసే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. స్తోమత ఉన్న వారు వీటిని బిగించుకోవాలి.

* మామూలు సంప్రదాయ తాళాలు వేస్తే బయట నుంచి చూసే వారికి ఇంట్లో ఎవరూ లేరని అర్థమవుతుంది. అలా కాకుండా సెంట్రల్‌లాక్‌ పెట్టుకోవాలి.

* పండుగలప్పుడు ఊళ్లకు వెళ్తుంటే సమీపంలోని పోలీస్‌స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. తద్వారా గస్తీ పోలీసులు ఓ కన్నేసి ఉంచుతారు.

* ఇంటి ముందు లైట్‌ వేయకపోయినా ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలిసిపోతుంది. అందుకే ఊరికి వెళ్లేటప్పుడు తమకు తెలిసిన వారికి చెప్పి, చీకటి పడగానే ఇంటి ముందు లైట్‌ వేయమని చెప్పాలి.

* ఇంటి ముందు చెప్పులు ఉంచాలి. దాంతో ఇంట్లో మనుషులు ఉన్నారన్న భావన కలుగుతుంది. పాలు వద్దని చెప్పాలి. పాలప్యాకెట్లు ఇంటి ముందు పడిఉంటే ఇంట్లో వారు ఊరికి వెళ్లారని అర్థమవుతుంది.

వారికి పండగే:

సాధారణంగా పండగల సీజన్‌లోనే ఈ ముఠాల సంచారం పెరుగుతుంది. ఏటా ఇదే తంతు. ఆ సమయంలో చాలామంది సొంత ఊర్లకు వెళ్లడానికి, పెద్దఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి నగదు దగ్గర పెట్టుకుంటుంటారు. అందుకే ఆ వేళల్లో ఇళ్లలోకి చొరబడితే ఎక్కువ మొత్తం దక్కుతుందనేది ముఠాల ఉద్దేశం. రాష్ట్రంలో ఇప్పటికే పర్వదినాల సీజన్‌ మొదలైంది. వినాయకచవితి నవరాత్రులు పూర్తవగా.. త్వరలో దసరా, దీపావళి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా చెడ్డీ గ్యాంగ్‌ హడావుడి చేస్తోంది. మరికొన్ని దోపిడీ ముఠాలు కూడా నగరంలో సంచరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

జాగ్రత్తలే శ్రీరామరక్ష:

గతంలో కంటే పోలీసు గస్తీ బాగా పెరిగింది. దాంతో శివార్లలో పరిస్థితి చాలా మెరుగైంది. తీవ్రత తగ్గినప్పటికీ దోపిడీలు మాత్రం ఆగడం లేదు. పోలీసుల వైపు నుంచి చర్యలు తీసుకుంటున్నా ప్రజలూ కొన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా దోపిడీ దొంగల బారిన పడకుండా కాపాడుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

* ఏదైనా ఆపద తలెత్తినప్పుడు డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి. చిన్న పిల్లలు, వృద్దులు సహా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన కల్పించాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details