Thailand Gambling Case Update: థాయ్‌లాండ్‌లో కేసినో ఆడుతూ పట్టుబడిన 93 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 83 మంది, ఆరుగురు థాయ్‌లాండ్ వాసులు, మరో నలుగురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీళ్లంతా ఏప్రిల్ 27వ తేదీన థాయ్‌లాండ్ కోన్‌బురిలోని ఏషియా పట్టాయ కన్వెన్షన్ హాల్‌లో దిగారు. హైదరాబాద్ నుంచి రవాణా ఛార్జీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. కేసినో కోసం డబ్బులు తీసుకెళ్లే అవసరం లేకుండా క్రెడిట్ నోట్స్ ఇచ్చారు. దీని కోసం ప్రత్యేక లాగ్ బుక్‌ను ప్రవీణ్, అతని అనుచరులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు కోన్బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడి చేసింది. పారిపోయేందుకు యత్నించిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.లక్షా 60 వేలు స్వాధీనం:చీకోటి ప్రవీణ్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాధవరెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. రూ.లక్షా 60 వేల నగదుతో పాటు 92 చరవాణీలు, ఐపాడ్, మూడు లాప్‌టాప్‌లు, 25 సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కన్వెన్షన్ హాల్‌లో ఉన్న సీసీ కెమెరాలు.. హైదరాబాద్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేసినట్లు గుర్తించారు. బక్కారా, బ్లాక్ జాక్ ఆటలు ఆడుతున్నట్లు గుర్తించారు. గ్యాంబింగ్‌కు సంబంధించిన పరికరాలన్నీ భారత్ నుంచే తెచ్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది.