కాంగ్రెస్ నూతన పీసీసీగా అధిష్ఠానం ఎవరిని ప్రకటించినా.. కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా భాజపా, తెరాస పార్టీల్లోకి వెళ్లరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పీసీసీ అధ్యక్షుడి ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ నుంచి వారి పార్టీలోకి పలువురు నాయకులు వస్తారని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భాజపా ఎంత బలహీనంగా ఉందో.. కమలం నేతల ఎదురు చూపులే చెబుతున్నాయని అన్నారు. పక్క పార్టీలో నుంచి నాయకులను చేర్చుకుని.. పార్టీని బలపరచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సరైన నాయకులు లేక భాజపా ఎంతటి దుస్థితిలో ఉందో ప్రజలకు తెలుసని అన్నారు.
మా పార్టీ అంతర్గతం..
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం తమ పార్టీ అంతర్గతమని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదన్నారు. పీసీసీ ఎంపిక విషయంలో పార్టీ నాయకుల మధ్య అభిప్రాయబేధాలు ఉంటే ఉండొచ్చన్నారు. అయినప్పటికి అధిష్ఠానం ఆదేశమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడానికి ఎప్పుడూ వెనకాడలేదన్నారు.