Text Books: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ అధికారుల ప్రణాళిక లోపంతో రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా పాఠ్య పుస్తకాలు వృథాగా మారాయి. సిలబస్ మారిపోతున్నందున వచ్చే విద్యా సంవత్సరమూ వీటిని వినియోగించే పరిస్థితి లేదు. సంస్కరణల పేరుతో ఈ ఏడాది ప్రైవేటు విద్యాసంస్థలూ కూడా విద్యాశాఖ దగ్గరే పుస్తకాలు కొనాలనే నిబంధన తీసుకొచ్చారు. ఇందుకోసం అధికారులు బయట మార్కెట్‌లో అమ్మే పుస్తకాల ముద్రణకు అనుమతులు ఇవ్వలేదు . ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి ఇండెంట్ తీసుకున్నారు.
కొన్నిచోట్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా, మండల విద్యాధికారులే ఇండెంట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జులై 5న పాఠశాలలు పునఃప్రారంభం కాగా, ఆగస్టు చివరి దాకా పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు బుక్స్ స్టోర్స్‌లో పాత పుస్తకాలను కొనుగోలు చేశారు. మరికొన్ని చోట్ల పూర్వ విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను తీసుకొని కొత్తవారికి ఇచ్చారు. విద్యాసంవత్సరం అయిపోతున్న విషయం తెలిసికూడా ఏ మాత్రం వేగంగా స్పందించని అధికారులు. తీరిగ్గా ఇండెంట్ ప్రకారం ముద్రించుకుంటూ వెళ్లిపోయారు. అప్పటికే సిలబస్ సగం అయిపోయింది.
తరువాత ఆలస్యంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, ప్రైవేటు యాజమాన్యాలు పుస్తకాల్ని తీసుకునేందుకు నిరాకరించాయి. మరికొన్ని యాజమాన్యాలు 1-5 తరగతులకు సొంత సిలబస్‌ను అమలు చేస్తున్నందున ప్రభుత్వ పుస్తకాల్ని తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలన్ని వృథాగా మారాయి. జిల్లా గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,39,104 మంది విద్యార్థులు ఉండగా... దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఉచిత పాఠ్యపుస్తకాలు ముద్రించేశారు. 2022-23లో 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. వీరంతా ప్రైవేటుకు వెళ్లిపోయారు.