Cabinet Sub Committee Meeting : ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ మరోసారి నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. ఉపాధ్యాయ నియామకాలు, మన ఊరు మన బడిపై చర్చించారు. టెట్ నిర్వహణకు కసరత్తు చేయాలని విద్యాశాఖకు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.
చివరగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ ఉత్తీర్ణులైన వారే ఉపాధ్యాయ నియామకాలకు అర్హులు. రాష్ట్రంలో సుమారు 13,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం సంవత్సరం క్రితమే ప్రకటించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో.. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు అడుగు పడలేదు. మరోవైపు కొన్ని నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందున.. టీచర్ అభ్యర్థుల్లో కొంతకాలంగా ఆందోళన నెలకొంది. నియామక ప్రక్రియ ప్రారంభించే ముందు మరోసారి టెట్ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
TET in Telangana Soon : గత సంవత్సర కాలంలో బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన వారితో పాటు.. గతంలో అర్హత సాధించలేక పోయిన వారికి, స్కోరు తక్కువ ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ వన్‌కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్ టూకు బీఈడీ అభ్యర్థులు అర్హులు. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.