రాజధాని నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు కలకలం సృష్టిస్తున్నాయి. మల్లేపల్లిలో జాతీయ దర్యాప్తు బృందం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నగరంలో ఎంత మంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో తెలంగాణ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదిహేనేళ్ల నుంచి రాష్ట్ర పోలీసులు ఒక్కరంటే ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేకపోయారు. రైల్వేస్టేషన్లో పేలుడుకు కారణమైన నసీర్ మాలిక్ ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా... అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లలో నిందితుడు, లష్కరేతోయిబా ఉగ్రవాది గులాం జాఫర్ పన్నెండేళ్లుగా టోలీచౌకీలో "లేటెస్ట్ లేడీస్ టైలర్" పేరుతో దుకాణం నిర్వహిస్తున్నా పోలీసులకు తెలీదు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులు, సానుభూతిపరులు నగరాన్ని సురక్షిత ఆశ్రయంగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఉత్తరాదివారితో పాటు విదేశీయులు వేల సంఖ్యలో నివాసముండటం వీరికి కలిసి వస్తోంది. పాతబస్తీ, టోలీచౌకీ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి ప్రాంతాలను ఉగ్రవాదులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.
మనలోనే ఉంటూ..
లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, హుజీ, ఐసిస్ ఉగ్రవాద సంస్థల సభ్యులు ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వేర్వేరు వృత్తులు చేసుకుంటూ చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉంటూనే ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులకు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా, చరవాణులు ట్రాక్ చేయకుండా రూట్ కాలింగ్, శాటిలైట్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు. మూడేళ్ల నుంచి స్ఫూఫింగ్ యాప్స్ సాయంతో ఉగ్ర సంస్థల నాయకులతో మాట్లాడున్నారు. గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో విధ్వంసం అనంతరం ఇప్పటి వరకూ 54 మంది ఉగ్రవాద సంస్థల సభ్యులు, సానుభూతిపరులను ఇతర రాష్ట్రాల పోలీసులు, నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.