ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా కేసు మరోసారి వాయిదా పడింది. తీర్పును వచ్చే నెల 3వ తేదీకి నాంపల్లి న్యాయస్థానం వాయిదా వేసింది. లష్కరే తోయిబా తీవ్రవాది టుండా... హైదరాబాద్లోని హుమాయున్ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ నెల 4న తుది తీర్పు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ... నేటికి తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది.
పేలుళ్లలో నిష్ణాతుడు
టుండాపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడిన కేసులున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న టుండా... బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడిగా పేరు పొందాడు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత... 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలోనూ టుండా నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్లో టుండా తలదాచుకున్నాడు. ఐఎస్ఐతో పాటు పలు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు.